Adilabad Cold Wave 2025: చలికి వణికిపోతున్న అడవుల జిల్లా.. ఆదిలాబాద్‌ జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Adilabad Cold Wave 2025: ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలులు.. ఉదయం, సంధ్య వేళల్లో కమ్ముకుంటున్న పొగమంచు.. రోజురోజుకు పతనమవుతున్న ఉష్ణోగ్రతలతో అడవుల జిల్లా ప్రజానీకం వణికిపోతోంది.

Update: 2025-12-26 05:40 GMT

Adilabad Cold Wave 2025: ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలులు.. ఉదయం, సంధ్య వేళల్లో కమ్ముకుంటున్న పొగమంచు.. రోజురోజుకు పతనమవుతున్న ఉష్ణోగ్రతలతో అడవుల జిల్లా ప్రజానీకం వణికిపోతోంది. దశాబ్దకాలం అనంతరం.. మళ్లీ ఆల్‌టైమ్‌ రికార్డు దిశగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చలితీవ్రత గజగజలాడిస్తోంది. గతవారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో.. ప్రస్తుతం వాతావరణం పూర్తిగా చల్లబడి చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. నిన్నమొన్నటి వరకు జిల్లాలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. అర్లీ-టి, గుంజాల, ఖండాల, డెడ్రా గ్రామాల్లో ఇవాళ ఏకంగా 6 డిగ్రీల అత్యల్ప ఉష్మోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి శీతలగాలులు చలికి తొడవ్వడం కారణంగా.. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. రాత్రి నుంచి చలితీవ్రత పెరిగిపోయి.. సరాసరి ఏడు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి.

చలితీవ్రత పెరిగిపోవడంతో పాటు వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు దుప్పటి మాదిరి కప్పేయడంతో రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్ మీదుగా నడిచే పలు ప్యాసింజర్ రైళ్లతో పాటు ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగాన్ని సైతం తగ్గించే పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్ మండలం అర్లీ-టి తో పాటు బేల మండలంలోని పలు గ్రామాల్లో గత వారం రోజులుగా అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ మండలాలపై చలిప్రభావం ఎక్కువగా ఉండగా.. బోథ్ డివిజన్‌లోని నాలుగు మండలాల్లో మరింత అత్యల్పంగా ఉష్టోగ్రతలు రికార్డవుతున్నాయి. జిల్లాలో ఒక్కసారిగా చలితీవ్రత పెరిగిపోవడంతో ఉదయం 10 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే గడుపుతున్నారు. చలి తీవ్రతతో రహదారులన్నీ జనసంచారం, వాహన సంచారం లేక వెలవెలబోతున్నాయి. ఎక్కడ చూసినా నలుగురు పోగై ఓ చోట చలిమంటలు వేసుకుంటున్న దృశ్యాలే కనబడుతున్నాయి.

గత దశాబ్దకాలం క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదు కాగా.. మళ్లీ అదే స్థాయిలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. ఇప్పటికే ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆస్తమా, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సత్వర వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయ రంగానికి ఆయువుపట్టైన పశువులపై కూడా చలి ప్రభావం చూపకుండా పశు వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

వృద్ధులపై శీతల గాలులు, చలి ప్రభావం అధికంగా ఉంది. కాగా రాబోవు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, చలి కారణంగా వృద్దులు, అస్తమా రోగులు, చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని, వాళ్లంతా ప్రికాషన్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా ఆల్ టైమ్ రికార్డు దిశగా పతనమవుతున్న ఉష్ణోగ్రతలతో జనం వణికిపోతున్నారు.


Tags:    

Similar News