బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో రెండోరోజు ముగిసిన కస్టడీ విచారణ

* బేగంపేట మహిళా పీఎస్‌లో అఖిలప్రియను ప్రశ్నించిన పోలీసులు * రెండోరోజు దాదాపు 8గంటలపాటు కొనసాగిన విచారణ * కిడ్నాపర్లతో అఖిలప్రియ మాట్లాడిన కాల్స్‌పై ప్రశ్నలు

Update: 2021-01-12 15:24 GMT

Bhuma Akhila Priya (file image) 

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో రెండోరోజు కస్టడీ విచారణ ముగిసింది. బేగంపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌లో అఖిలప్రియను దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను ఆమె ముందు ఉంచి కిడ్నాపర్లతో అఖిలప్రియ మాట్లాడిన కాల్స్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. మొబైల్ టవర్స్ లొకేషన్, కాల్ డేటా, సీసీ ఫుటేజీ ఆధారంగా.. కొన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. భర్త భార్గవ్‌రామ్‌ ఆచూకీపై వివరాలు అడగగా భార్గవ్‌ ఎక్కడున్నాడో తనకు తెలియదని చెప్పింది అఖిలప్రియ. దీంతో మరింత సమాచారం రాబట్టేందుకు అఖిలప్రియను రేపు కూడా పోలీసులు విచారించనున్నారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో మాజీమంత్రి అఖిలప్రియను అడ్వకేట్‌ సమక్షంలో విచారించామని డీసీపీ కమలేశ్వర్ తెలిపారు. అఖిలప్రియ ఆరోగ్యం బాగానే వుందని ఆయన అన్నారు. 14వ తేదీ మధ్యాహ్నం వరకు ఆమె కస్టడీలోనే వుంటుందని చెప్పారు. రేపు అఖిలప్రియను మరోసారి విచారిస్తామన్నారు డీసీపీ కమలేశ్వర్.

మరోవైపు బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో భూమా కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ ప్లాన్ అమలు చేయడానికి ముందు.. జగత్ కిడ్నాపర్లతో మాట్లాడినట్టు పోలీసులు భావిస్తున్నారు. అఖిలప్రియ అరెస్ట్ సమయంలోనే విఖ్యాత్ ను విచారించిన పోలీసులు అతడి నుంచి వివరాలు సేకరించి వదిలేశారు. ఇప్పుడు జగత్ డ్రైవర్ చెప్పిన ఆధారాలతో మరోసారి విఖ్యాత్ ను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ కేసులో భాగంగా విజయవాడలో కిడ్నాప్ కేసు నిందితుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు వాళ్లంతా గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో గోవాకు వెళ్లిన పోలీసు బృందం.. కొంతమందిని అదుపులోకి తీసుకుంది. అలాగే విజయవాడలో కూడా పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ రాత్రికి నిందితులను హైదరాబాద్ కు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News