బాలుని ప్రాణం తీసిన గాలిపటం

Update: 2020-09-13 05:34 GMT

ప్రతీకాత్మక చిత్రం

అభం శుభం ఎరుగరని ఓ చిన్నారి బాలుని ప్రాణాలను గాలిపటం బలితీసుకుంది. సరదాగా ఎగరేస్తున్న గాలి పటం దారం కాస్త కరెంటు తీగలకు చిక్కుకోవడంతో ఆ దారాన్ని తీయబోయి 12 ఏళ్ల చిన్నారి బాలుడు ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారకమైన సంఘటన హైదరాబాద్ నగరంలోని నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన పూర్తివివరాల్లోకెళితే సాయినగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న కుమార్‌ (35) అనే వ్యక్తికి భార్య, కీర్తన్ అనే 12 ఏళ్ల కుమారుడితోపాటు ఓ కూతురు కూడా ఉంది. అయితే అతను కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకపోవడంతో కీర్తన్ శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎదురింటి భవనంపైకి వెళ్లి గాలిపటాన్ని ఎగురేస్తూ ఆడుకుంటున్నాడు. అలా సరదాగా కాసేపు ఎగరేసిన తరువాత గాలి పటం దారం అనుకోకుండా భవనంపై వేలాడుతున్నా విద్యుత్‌ తీగల మధ్యలో చిక్కుకుపోయింది. దీంతో ఆ బాలుడు గాలిపటాన్ని తీసే ప్రయత్నం చేసాడు. గాలిపటాన్ని అందుకుని లాగే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు కీర్తన్ కి తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు, బాలుని తల్లిదండ్రులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్ధారించారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు కల్ల ముందే విగతజీవిగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆవేదనను చూసి చుట్టుపక్కల వాళ్లు సైతం కంటతడి పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా తమ ఇండ్లపై విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని స్థానికులు అధికారులకు ఎన్ని సార్లు కంప్లెయింట్ ఇచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బయటికి వెళ్లి చేతులు ఎత్తితే అందేంత దూరంలో ఉన్న కరెంట్ తీగలు ఉన్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు కోపొధ్రుక్తులవుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ఇళ్లకు దగ్గర్లో ఉన్న కరెంట్ తీగలను తొలగించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News