Poco X8 Pro Iron Man Edition: పవర్‌ఫుల్ ఫీచర్స్.. ఐరన్ మ్యాన్ డిజైన్.. పోకో నుంచి వస్తున్న ఈ 'మార్వెల్' ఫోన్ చూశారా?
Poco X8 Pro Iron Man Edition: పోకో సంస్థ తన ఎక్స్ సిరీస్‌లో భాగంగా అత్యంత శక్తివంతమైన పోకో X8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Poco X8 Pro Iron Man Edition: పవర్‌ఫుల్ ఫీచర్స్.. ఐరన్ మ్యాన్ డిజైన్.. పోకో నుంచి వస్తున్న ఈ 'మార్వెల్' ఫోన్ చూశారా?
Poco X8 Pro Iron Man Edition: పోకో సంస్థ తన ఎక్స్ సిరీస్‌లో భాగంగా అత్యంత శక్తివంతమైన పోకో X8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మొబైల్ ఇప్పటికే ఐరోపా, భారత్, ఇండోనేషియా వంటి దేశాల్లో సర్టిఫికేషన్లు పూర్తి చేసుకోగా, తాజాగా థాయ్‌లాండ్ NBTC డేటాబేస్‌లో కూడా కనిపించింది. అయితే ఈసారి ప్రత్యేకంగా 'ఐరన్ మ్యాన్ ఎడిషన్' పేరుతో ఒక థీమ్డ్ మోడల్ సర్టిఫికేషన్ పొందడం మార్వెల్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో పోకో X7 ప్రో విషయంలోనూ ఇలాంటి భాగస్వామ్యం ఉండటంతో, అదే ఒరవడిని కంపెనీ ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
NBTC లిస్టింగ్ ద్వారా ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్ నంబర్ 2511FPC34G అని తెలిసినప్పటికీ, హార్డ్‌వేర్ , డిజైన్ పరంగా పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. సాధారణంగా ఇటువంటి స్పెషల్ ఎడిషన్లలో ఐరన్ మ్యాన్ సూట్‌ను పోలి ఉండే ఎరుపు , బంగారు రంగు డిజైన్‌తో పాటు ప్రత్యేకమైన బాక్స్ ప్యాకేజింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో త్వరలో విడుదల కానున్న రెడ్‌మీ టర్బో 5కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా అంతర్జాతీయ మార్కెట్లోకి వస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం ప్రో మోడల్ మాత్రమే కాకుండా కొన్ని దేశాల్లో ప్రో మ్యాక్స్ వెరియంట్‌ను కూడా పోకో పరిచయం చేసే అవకాశం ఉంది.
లాంచ్ సమయం విషయానికి వస్తే పోకో సాధారణంగా తన ఎక్స్ సిరీస్‌ను జనవరి నెలలో విడుదల చేస్తూ వస్తోంది. గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో X7 ప్రో మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో, X8 ప్రో విడుదల కూడా అతి త్వరలోనే ఉండబోతుందని అర్థమవుతోంది. జూలై నెల నుండే ఈ ఫోన్ సర్టిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల కంపెనీ ఇప్పటికే ఉత్పత్తిని ముమ్మరం చేసి ఉంటుందని అంచనా. జనవరి ఆఖరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోనూ అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
సాంకేతిక హార్డ్‌వేర్ పరంగా ఈ ఫోన్లు అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉండనున్నాయి. పోకో X8 ప్రో మరియు ప్రో మ్యాక్స్ రెండు మోడళ్లలోనూ స్పష్టమైన విజువల్స్ కోసం 1.5K రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేలను అందించనున్నారు. పనితీరు కోసం ప్రో మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్ వాడనుండగా, మరింత వేగవంతమైన అనుభూతి కోసం ప్రో మ్యాక్స్ వేరియంట్‌లో డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను అమర్చే అవకాశం ఉంది. గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ శక్తివంతమైన చిప్‌సెట్లను పోకో ఎంచుకున్నట్లు సమాచారం.
సాఫ్ట్‌వేర్ విషయంలో కూడా పోకో విప్లవాత్మక మార్పులు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్లు సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3తో మార్కెట్లోకి రానున్నాయని లీకులు వెల్లడిస్తున్నాయి. వినియోగదారులకు దీర్ఘకాలిక భరోసా కల్పిస్తూ ఏకంగా ఏడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ ప్రకటించడం విశేషం. మిడ్-రేంజ్ విభాగంలో ఇంత సుదీర్ఘ కాలం అప్‌డేట్లు అందించడం వల్ల పోకో X8 ప్రో మార్కెట్లో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ధర , పూర్తి ఫీచర్ల వివరాలు లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడికానున్నాయి.