WPL 2026 : ముంబై ఇండియన్స్ విశ్వరూపం..హర్మన్, బ్రంట్ తుపాన్లో కొట్టుకుపోయిన ఢిల్లీ
WPL 2026 : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మళ్ళీ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుంది.
WPL 2026 : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మళ్ళీ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుంది. శనివారం జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై చిత్తుగా ఓడించి సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్న హర్మన్‌ప్రీత్ సేన, ఢిల్లీపై పంజా విసిరింది. బ్యాటింగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన ముంబై, బౌలింగ్‌లోనూ అదే పదును చూపిస్తూ ఢిల్లీని కట్టడి చేసింది. ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్‌కు ఈ మ్యాచ్ ఒక పీడకలలా మిగిలిపోయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ అమెలియా కెర్ తొలి బంతికే డకౌట్ అవ్వడంతో స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. అయితే నేట్ సీవర్ బ్రంట్, గుణాలన్ కమలిని (16) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత అసలైన వేట మొదలైంది. నేట్ సీవర్ బ్రంట్ 46 బంతుల్లోనే 70 పరుగులు (13 ఫోర్లు) చేసి ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేసింది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వీరిద్దరి మెరుపులతో ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివర్లో నికోలా కారీ (21) కూడా మెరుపులు మెరిపించింది.
196 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. ఢిల్లీ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ (8), కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ (1), లారా వోల్వార్డ్ (9) దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ జట్టులో కనీసం ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారంటే ముంబై బౌలింగ్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం చినెలే హెన్రీ ఒక్కతే ఒంటరి పోరాటం చేస్తూ 56 పరుగులు సాధించింది. ఆమె పోరాటం వృథా కావడంతో ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయింది.
ముంబై బౌలర్లలో అమెలియా కెర్, నికోలా కారీ చెరో 3 వికెట్లతో ఢిల్లీ వెన్ను విరిచారు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన నేట్ సీవర్ బ్రంట్ బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్ కూడా తలో వికెట్ తీసి జట్టు విజయంలో భాగస్వాములయ్యారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తన ఖాతాను తెరిచింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ బ్యాటర్ల వైఫల్యం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.