WPL 2026: నరాలు తెగే ఉత్కంఠ..ఆఖరి ఓవర్లో సీన్ సితార్..ఆర్సీబీ భామల ఊరమాస్ వేట
WPL 2026: మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు అసలైన క్రికెట్ మజా దొరికింది.
WPL 2026: నరాలు తెగే ఉత్కంఠ..ఆఖరి ఓవర్లో సీన్ సితార్..ఆర్సీబీ భామల ఊరమాస్ వేట
WPL 2026: మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు అసలైన క్రికెట్ మజా దొరికింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం సాక్షిగా జరిగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసాధారణ రీతిలో పుంజుకుని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లెర్క్ వీరోచిత పోరాటం చేసి ముంబై నోటికాడ ముద్దను లాగేసింది. కేవలం 3 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘనవిజయాన్ని నమోదు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ అమేలియా కెర్ (4) త్వరగానే అవుట్ కాగా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (20), నటాలీ బ్రంట్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఒక దశలో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, సజీవన్ సజనా (25 బంతుల్లో 45) మరియు నికోలా కేరీ (29 బంతుల్లో 40) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి మెరుపులతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్ నాడిన్ డి క్లెర్క్ 4 వికెట్లతో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించింది.
ఆర్సీబీ బౌలింగ్‌లో లారెన్ బెల్ అద్భుతమైన స్పెల్ వేసింది. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 19 డాట్ బాల్స్ వేసింది. ఈ పొదుపైన బౌలింగ్ ముంబైని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసింది. అటు బౌలింగ్‌లో వికెట్లు తీసి, ఇటు పొదుపుగా బౌలింగ్ చేసి ఆర్సీబీ బౌలర్లు ముంబైపై పట్టు సాధించారు.
155 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్లు స్మృతి మందన్న, గ్రేస్ హారిస్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 3.5 ఓవర్లలోనే 40 పరుగులు జోడించినా, ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో ఆర్సీబీ 121 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ముంబై వైపు మొగ్గుతున్న తరుణంలో నాడిన్ డి క్లెర్క్ శివమెత్తింది. ఆఖరి 2 ఓవర్లలో 29 పరుగులు కావాల్సిన దశలో, 19వ ఓవర్లో 11 పరుగులు, ఆఖరి ఓవర్లో ఏకంగా 18 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ముగించింది. మొత్తంగా 44 బంతుల్లో 63 పరుగులు (7 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచింది.