WPL 2026 : నేటి నుంచే డబ్ల్యూపీఎల్ నగారా.. లేడీ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో టోర్నీలో హీట్!
WPL 2026 : మహిళా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ 2026 నాలుగో సీజన్ సందడి మొదలైంది.
WPL 2026 : నేటి నుంచే డబ్ల్యూపీఎల్ నగారా.. లేడీ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో టోర్నీలో హీట్!
WPL 2026: మహిళా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ 2026 నాలుగో సీజన్ సందడి మొదలైంది. నేటి నుంచే (జనవరి 9) ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి దిగ్గజాలతో పాటు, ఈసారి డబ్ల్యూపీఎల్ వేదికపై కొందరు యువ తుపానులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో సెన్సేషన్ సృష్టించిన నలుగురు అమ్మాయిలపై అందరి కళ్లు ఉన్నాయి.
దియా యాదవ్ : కేవలం 16 ఏళ్ల వయసులో డబ్ల్యూపీఎల్ బరిలోకి దిగుతున్న దియా యాదవ్‌ను అందరూ లేడీ వైభవ్ సూర్యవంశీ అని పిలుస్తున్నారు. హర్యానాకు చెందిన ఈ విధ్వంసకర బ్యాటర్, అండర్-15 టోర్నీలో త్రిపురపై కేవలం 125 బంతుల్లోనే 213 పరుగులు చేసి సంచలనం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈమెను భారీ ఆశలతో కొనుగోలు చేసింది. 2027 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌కు ఈమె ప్రధాన ఆయుధం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అనుష్క శర్మ : ఈ పేరు వినగానే అందరూ బాలీవుడ్ నటి అనుష్క శర్మ అనుకుంటారు, కానీ ఈమె క్రికెట్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే యంగ్ ప్లేయర్. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ వేయగల సామర్థ్యం ఈమె సొంతం. బీసీసీఐ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్‌లో 155 పరుగులు చేసి మూడవ టాప్ స్కోరర్‌గా నిలిచింది. గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఈమె ఒక ఫినిషర్‌గా ఉపయోగపడే అవకాశం ఉంది.
జి. త్రిష : మన తెలుగు అమ్మాయి జి. త్రిష ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. కేవలం 8 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ అండర్-16 టీమ్‌కు ఎంపికైన ఘనత ఈమెది. 2025 అండర్-19 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన త్రిష, ఇప్పుడు యూపీ వారియర్స్ తరపున తన లెగ్ స్పిన్ మాయాజాలాన్ని చూపించనుంది. బ్యాటింగ్‌లోనూ నిలకడగా రాణించే త్రిష, యూపీ టీమ్‌కు పెద్ద ఎసెట్ కానుంది.
గౌతమీ నాయక్ : మహారాష్ట్రకు చెందిన గౌతమీ నాయక్ కెరీర్ ఎన్నో మలుపులతో సాగింది. కరోనా సమయంలో అవకాశాలు లేక నాగాలాండ్ జట్టుకు వెళ్లి అక్కడ తన సత్తా నిరూపించుకుంది. తిరిగి మహారాష్ట్ర టీమ్‌లోకి వచ్చి, ఎంపీఎల్ టోర్నీలో స్మృతి మంధానతో కలిసి ఓపెనింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లో కూడా ఆర్సీబీ తరపున స్మృతితో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం గౌతమీకి లభించింది. ఈ కష్టజీవి ప్రయాణం ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకుంది.