Pakistan Cricket: అభిమానుల ముందే.. పాకిస్తాన్ జట్టుపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు!

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రదర్శనపై లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-02-03 07:20 GMT

Pakistan Cricket: అభిమానుల ముందే.. పాకిస్తాన్ జట్టుపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు!

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రదర్శనపై లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్‌ల్లో పాక్ వరుస పరాజయాలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్థాన్ అభిమానుల సమక్షంలోనే జట్టుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అక్రమ్ మాటలు అక్కడున్నవారిని కూడా ఆలోచనలో పడేశాయి. ఇటీవలి కాలంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లను ప్రస్తావిస్తూ.. పాక్ ఆటగాళ్ల ప్రదర్శనపై మండిపడ్డారు. ఒకటి లేదా రెండుసార్లు ఓడితే పర్వాలేదు అని, ప్రతిసారి ఓడితే అంగీకరించలేమని పాక్ దిగ్గజం ఫైర్ అయ్యారు.

తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో వసీం అక్రమ్ అభిమానులతో ముచ్చటించాడు. 'గత 2-3 ఏళ్లలో భారత్‌పై మనం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లే గెలిచాం' అని అభిమానులతో అన్నారు. దీనికి స్పందించిన పాక్ అభిమానులు.. 'అవును, ఒక మ్యాచ్ గెలిచాం' అంటూ అంగీకరించారు. వెంటనే అక్రమ్ స్పందిస్తూ.. 'నాకు తెలుసు. అభిమానులు అయితే టీవీ ఆఫ్ చేసి వెళ్లిపోతారు. కానీ మేము కామెంటేటర్లం. పాకిస్థాన్ ఓడుతున్నా సరే.. చివరి బంతి వరకూ మ్యాచ్ చూడాల్సి వస్తుంది, వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. మీకన్నా ఎక్కువ బాధగా ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చారు.

పాకిస్థాన్ జట్టు ఓటముల పరంపరపై వసీం అక్రమ్ తీవ్రంగా స్పందించారు. 'గెలుపు-ఓటములు ఆటలో భాగమే. కానీ ప్రతిసారి ఓడిపోవడం సరైంది కాదు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. మళ్లీ మళ్లీ ఓడుతూ ఉండటం అంగీకరించలేం' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జట్టు ప్రదర్శనలో స్థిరత్వం లేకపోవడం, కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోవడం పాక్ క్రికెట్‌కు పెద్ద సమస్యగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్ దిగ్గజం చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. మాజీ ఆటగాళ్లే ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం.. పాక్ క్రికెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది. అభిమానులు, విశ్లేషకులు కూడా అక్రమ్ మాటలకు మద్దతు తెలుపుతున్నారు. జట్టు నిజంగా మారాలంటే.. మాటలకే పరిమితం కాకుండా ఆటలోనూ మార్పులు చూపించాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News