BCCI-Laxman: బీసీసీఐ నన్ను పట్టించుకోవడం లేదు, రాజీనామా చేస్తున్నా.. మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు!

బీసీసీఐపై టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీసీఐ తనను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీసీసీఐ కామెంటేటర్‌ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం శివరామకృష్ణన్‌ ప్రకటించారు.

Update: 2026-03-21 08:33 GMT

BCCI-Laxman: బీసీసీఐ నన్ను పట్టించుకోవడం లేదు, రాజీనామా చేస్తున్నా.. మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు!

BCCI-Laxman:భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీసీఐ తనను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీసీసీఐ కామెంటేటర్‌ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం శివరామకృష్ణన్‌ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెట్టారు. అవకాశాల లేమిని తన నిర్ణయానికి కారణంగా ప్రస్తావించారు. అదే సమయంలో వర్ణ వివక్ష కూడా కారణమై ఉండవచ్చని శివరామకృష్ణన్‌ ఆరోపించడం ఇపుడు పెద్ద చర్చకు దారి తీసింది.

బీసీసీఐ నన్ను నిర్లక్ష్యం చేస్తోంది:

'23 ఏళ్లుగా బీసీసీఐ నన్ను నిర్లక్ష్యం చేస్తోంది. నా పాత్రను పరిమితం చేసేలా వ్యవహరించిందది. బ్రాడ్‌ కాస్టింగ్‌తో సుదీర్ఘ సంబంధాలు ఉన్నా ఒక్కసారి కూడా నాకు కీలక బాధ్యతలు అప్పగించలేదు. 23 ఏళ్లుగా నన్ను బిగ్ మ్యాచులకు టాస్‌ వేయడం, అవార్డు ప్రజెంటేషన్‌ వంటి వాటికి బాధ్యతలు ఇవ్వలేదు. నా తర్వాత వచ్చిన వారికి కూడా అవకాశాలు దక్కాయి. రవిశాస్త్రి టీమిండియా కోచ్‌గా ఉన్నప్పుడూ బీసీసీఐ కొత్త వాళ్లతోనే పిచ్‌ రిపోర్ట్ ప్రజెంటేషన్‌ చేయించింది. నేను ఉన్నా కూడా కొత్త వారికి అవకాశాలు ఇవ్వడానికి కారణాలు ఏంటో అర్థం కావడం లేదు. నా ఆత్మగౌరవాన్ని చంపుకోలేను. బీసీసీఐ కామెంటేటర్‌ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నా. నా ఈ నిర్ణయం ఒక కథకు ఆరంభం మాత్రమే. క్రికెట్ అభిమానులు షాక్ అవుతారని తెలుసు. అంతేకాదు ట్రోల్స్ కూడా వస్తాయి. అయితే నేను మంచి వాడినని భావించిన వారికి ధన్యవాదాలు' అని లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ పేర్కొన్నారు.

మైదానంలో కనిపించిన దాఖలాలు లేవు:

లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ నిర్ణయంపై భారత మాజీ స్పిన్నర్ ఆర్ అశ్విన్ స్పందించారు. 'వద్దు. ఈ ఐపీఎల్‌లో నీకు అవకాశాలు వస్తాయి' అంటూ ట్వీట్ చేశారు. భారత్ ఆడే బిగ్ మ్యాచులకు ఎక్కువగా రవి శాస్త్రి, హర్షా భోగ్లేలు టాస్, ప్రజెంటేషన్‌ బాధ్యతలను నిర్వర్తిస్తారు. మరికొందరు విదేశీ కామెంటేటర్లు పని చేస్తుంటారు. శివరామకృష్ణన్‌ మైదానంలో కనిపించిన దాఖలాలు లేవు. చాన్నాళ్లుగా టాస్, ప్రజెంటేషన్‌ బాధ్యతలు అప్పగించడంలో నిర్లక్ష్యానికి గురికావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఆరోపణలపై బీసీసీఐ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

2000లో కామెంటరీ కెరీర్‌:

శివరామకృష్ణన్ 2000 సంవత్సరంలో కామెంటరీ కెరీర్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా ఐసీసీ క్రికెట్ కమిటీకి ప్లేయర్ ప్రతినిధిగా కూడా సేవలందించారు. క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే..1980లలో భారత్ తరఫున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడారు. 1984లో ఇంగ్లాండ్‌పై 12 వికెట్లు తీసి గుర్తింపు పొందారు. 1985లో సునీల్ గవాస్కర్ నాయకత్వంలో ఆస్ట్రేలియాలో జరిగిన బెన్సన్ అండ్ హెజెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫైనల్లో పాకిస్తాన్‌పై బౌలింగ్‌లో మెరుగు ప్రదర్శన చేసి జట్టును విజయపథంలో నడిపించారు.

Tags:    

Similar News