Travis Head: చాలా సిగ్గుగా ఉంది.. ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచకప్ 2026లో చిన్న జట్లు బాగా ఆడుతున్నాయి. అద్భుత ప్రదర్శనలతో పేద జట్లను వణికిస్తున్నాయి.
Travis Head: చాలా సిగ్గుగా ఉంది.. ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచకప్ 2026లో చిన్న జట్లు బాగా ఆడుతున్నాయి. అద్భుత ప్రదర్శనలతో పేద జట్లను వణికిస్తున్నాయి. ఇంగ్లాండ్‌ను నేపాల్, దక్షిణాఫ్రికాను అఫ్గానిస్థాన్, భారత్‌ను అమెరికా, పాకిస్థాన్‌ను నెదర్లాండ్స్ ఓ పక్క భయపెట్టాయి. జింబాబ్వే కూడా ఆస్ట్రేలియాను భయపెడుతుంది అనుకున్నారు. కానీ ఏకంగా ఊహించని షాక్ ఇస్తుందని మాత్రం ఎవరు ఊహించలేదు. టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-బిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ముందుగా జింబాబ్వే 2 వికెట్లకు 169 పరుగులు చేయగా.. ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే విజయంలో బ్రయాన్ బెనెట్ (64 నాటౌట్), ముజరబాని (4/17), ఎవాన్స్ (3/23)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం అనంతరం ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతడు జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. 'నిజాయితీగా చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది. ఈ రోజు మా ఆట చాలా చెత్తగా ఉంది' అని చెప్పాడు. 'బ్యాటింగ్ విభాగమే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బగా మారింది. అప్పుడే మ్యాచ్ మా చేతుల నుంచి జారిపోయిందది. మాట్ రెన్షా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు, ఇద్దరు మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ చివరకు విజయాన్ని అందుకోలేకపోయాము' అని చెప్పాడు.
ప్రత్యర్థి జింబాబ్వే జట్టు ప్రదర్శనను కూడా ట్రావిస్ హెడ్ ప్రశంసించాడు. 'జింబాబ్వే అద్భుతంగా ఆడిండి. ముఖ్యంగా వారి ఫీల్డింగ్ అద్భుతం. ఫీల్డింగ్ నైపుణ్యమే మ్యాచ్‌ను తిప్పింది. ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. చాలా నిరాశగా ఉంది. జట్టు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది' అని హెడ్ చెప్పుకొచ్చాడు. హెడ్ ఈ వ్యాఖ్యలు ఆసీస్ జట్టు ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని అభిమానులు అంటున్నారు. కీలక మ్యాచ్‌లలో స్థిరత్వం లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్ ఇవ్వడం ఇదే రెండోసారి. 2007ప్రపంచకప్‌లో ఆసీస్ జట్టును జింబాబ్వే ఓడించింది. రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, హేడెన్, మైక్ హస్సి, బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్న ఆ మ్యాచులో పసికూన జింబాబ్వే 5 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా ఆసీస్ 138/9 రన్స్ చేయగా.. మరో బంతి మిగిలుండగా జింబాబ్వే లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు ఆస్ట్రేలియాను కట్టడి చేసి విజయాన్ని అందుకుంది.