T20 World Cup : బంతి కనిపిస్తే బాదుడే బాదుడు..టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాళ్లు వీళ్లే
టీ20 క్రికెట్ అంటేనే సిక్సర్ల మోత. మైదానంలో బ్యాటర్లు బంతిని గాల్లోకి లేపి స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే వచ్చే మజానే వేరు.
T20 World Cup : బంతి కనిపిస్తే బాదుడే బాదుడు..టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాళ్లు వీళ్లే
T20 World Cup : టీ20 క్రికెట్ అంటేనే సిక్సర్ల మోత. మైదానంలో బ్యాటర్లు బంతిని గాల్లోకి లేపి స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే వచ్చే మజానే వేరు. ముఖ్యంగా ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో ప్రపంచ స్థాయి హిట్టర్లు తమ పవర్‌ను చూపిస్తూ రికార్డుల మోత మోగించారు. సిక్సర్ల విషయంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నుంచి టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ వరకు టాప్-5లో ఉన్న సిక్సర్ల వీరులెవరో తెలుసుకుందాం.
క్రిస్ గేల్ : టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు వెస్టిండీస్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరు మీద ఉంది. 2007 నుంచి 2021 వరకు ఆయన ఆడిన 33 మ్యాచ్‌ల్లో ఏకంగా 63 సిక్సర్లు బాదారు. గేల్ క్రీజులో ఉన్నాడంటే చాలు బంతి బౌండరీ లైన్ దాటి వెళ్లాల్సిందే. ఆయన పవర్‌ఫుల్ హిట్టింగ్ టీ20 క్రికెట్‌కే కొత్త అర్థాన్ని ఇచ్చింది.
రోహిత్ శర్మ : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. హిట్ మ్యాన్ గా పిలవబడే రోహిత్ 2007 నుంచి 2024 వరకు ఆడిన 47 మ్యాచ్‌ల్లో 50 సిక్సర్లు కొట్టారు. తనదైన క్లాస్, టైమింగ్‌తో రోహిత్ బాదే సిక్సర్లు చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. 1200కు పైగా పరుగులతో భారత్ వరల్డ్ కప్ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
జోస్ బట్లర్ : ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన వినూత్నమైన షాట్లతో టీ20 వరల్డ్ కప్‌లో సంచలనాలు సృష్టించాడు. 35 మ్యాచ్‌ల్లో బట్లర్ 43 సిక్సర్లు బాది మూడో స్థానంలో నిలిచారు. మైదానం నలుమూలలా షాట్లు ఆడగల సామర్థ్యం బట్లర్‌ను ప్రమాదకరమైన బ్యాటర్‌గా మార్చింది.
డేవిడ్ వార్నర్ : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. వార్నర్ 41 మ్యాచ్‌ల్లో 40 సిక్సర్లు కొట్టారు. బంతిని బాదడానికి కేవలం బలం మాత్రమే కాదు, సరైన టైమింగ్ ఉంటే చాలని వార్నర్ నిరూపించారు. ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్ అందించడంలో వార్నర్ సిక్సర్లు ఎంతో సాయపడ్డాయి.
విరాట్ కోహ్లీ : సాధారణంగా క్లాసిక్ షాట్లు, సింగిల్స్, డబుల్స్ తో ఇన్నింగ్స్ నిర్మించే విరాట్ కోహ్లీ, అవసరమైనప్పుడు సిక్సర్లతో విరుచుకుపడటంలోనూ దిట్ట. కోహ్లీ 35 మ్యాచ్‌ల్లో 35 సిక్సర్లు బాది టాప్-5లో నిలిచారు. ఒత్తిడి సమయంలో కోహ్లీ కొట్టే సిక్సర్లు టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాయి.