Aiden Markram: ఇది ప్రతీకారమే, భారత్‌పై గెలుపు చాలా ఆనందంగా ఉంది.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
గత ఓటమికి ప్రతీకారంగా భావిస్తున్నాం.. భారత్‌పై విజయం జట్టుకు భారీ ఆత్మవిశ్వాసం ఇచ్చిందని ఐడెన్ మార్క్రామ్ వ్యాఖ్యలు.
Aiden Markram: ఇది ప్రతీకారమే, భారత్‌పై గెలుపు చాలా ఆనందంగా ఉంది.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో భారత్‌పై ఘన విజయం సాధించిన అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఎదురైన ఓటమికి ఇది ప్రతీకారం లాంటిదని పేర్కొన్నాడు. భారత్ వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఇంత భారీ తేడాతో ఓడించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ విజయం జట్టు విశ్వాసాన్ని పెంచిందని, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ తదుపరి మ్యాచ్‌ల్లో కూడా విజయాలు సాధించి సెమీఫైనల్‌కు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించాడు. భారత్‌తో మ్యాచ్‌లో తమ జట్టు ప్రదర్శనపై మార్‌క్రమ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు.
మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మాట్లాడుతూ... 'జట్టు ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో పిచ్ స్పందించిన తీరు భిన్నంగా ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు త్వరగా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రణాళికలను అమలు చేశారు. మా బౌలర్లు టోర్నీ ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డప్పటికీ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ కలిసి జట్టును కష్టసమయంలో నిలబెట్టారు. ఇద్దరు ఇన్నింగ్స్‌ను నిర్మించి మ్యాచ్‌ను మా వైపు తిప్పారు. కఠిన పరిస్థితుల్లో కూడా బాగా పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో, చివర్లో భారత బౌలర్లు బాగా బౌలింగ్ చేసినా.. మధ్య ఓవర్లలో మా బ్యాటింగ్ బాగుంది. ఆడే మమల్ని మ్యాచులో నిలబెట్టింది' అని చెప్పాడు.
'మా ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు జారవిడిచినా బాగానే కష్టపడ్డారు. గత మ్యాచ్‌తో పోలిస్తే జట్టు బాగా ఆడింది. ఈ మ్యాచులో కొన్ని తప్పులు జరిగాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. లుంగి ఎన్‌గిడి ఎప్పుడైనా వికెట్లు తీయగల ప్రమాదకర బౌలర్. పిచ్ పరిస్థితులను బట్టి కొత్త బంతితో బౌలింగ్ చేయాలా లేదా మధ్య ఓవర్లలో చేయాలని నిర్ణయిస్తాము. జట్టు అవసరానికి అనుగుణంగా ఏ పాత్రైనా పోషించేందుకు ఎన్‌గిడి సిద్ధంగా ఉంటాడు. అతడు నిజమైన టీమ్‌మ్యాన్' అని ఐడెన్ మార్‌క్రమ్ ప్రశంసలు కురిపించాడు. భారత్‌పై ఘన విజయంతో సఫారీ టీమ్ సెమీస్ వైపు అడుగులు వేసింది.