T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే బిగ్గెస్ట్ షాక్.. టీమిండియా సెమీస్ చేరడం కష్టమేనా?
టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే బిగ్గెస్ట్ షాక్.. టీమిండియా సెమీస్ చేరడం కష్టమేనా?
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏకంగా 76 పరుగుల తేడాతో సఫారీలు భారత్‌ను చిత్తు చేశారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం. ఈ ఓటమితో అప్పటివరకు సాగిన టీమిండియా విజయ పరంపరకు బ్రేక్ పడటమే కాకుండా, సెమీఫైనల్ దారులు కూడా క్లిష్టంగా మారాయి.
188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ రాణించి సఫారీలను 187 పరుగుల వద్ద కట్టడి చేసినప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేశారు. ఈ టోర్నీ ఆరంభం నుంచి ఫామ్‌లో లేని భారత టాప్ ఆర్డర్ మరోసారి దారుణంగా విఫలమైంది. నిర్ణీత ఓవర్లలో కేవలం 111 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయ్యింది. సూర్యకుమార్ సేన ఆటతీరు చూసి స్టేడియంలోని వేలాది మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ ఓటమితో భారత్ ఇప్పుడు చావో రేవో పరిస్థితికి చేరుకుంది. సూపర్-8లో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోవడం భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఇప్పుడు భారత్ సెమీఫైనల్ చేరాలంటే ఫిబ్రవరి 26న జింబాబ్వేపై, మార్చి 1న వెస్టిండీస్‌పై ఖచ్చితంగా గెలవాలి. కేవలం ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే సరిపోదు.. ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తమ తర్వాతి మ్యాచుల్లో ఓడిపోవాలని భారత అభిమానులు కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాయింట్లు సమానమైనప్పుడు సెమీఫైనల్ బెర్తును నెట్ రన్ రేట్ నిర్ణయిస్తుంది. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో భారత్ రన్ రేట్ -3.800 కు పడిపోయింది. అటు సఫారీలు +3.800 తో అగ్రస్థానంలో ఉన్నారు. అంటే భారత్ తన తర్వాతి రెండు మ్యాచ్‌లను కేవలం గెలవడమే కాదు, భారీ పరుగుల తేడాతో విజయం సాధించాలి. అలా చేస్తేనే నెట్ రన్ రేట్ మెరుగుపడి సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ సూపర్-8 నుంచే ఇంటిదారి పట్టక తప్పదు.