Abhishek Sharma : టీమిండియాకు భారంగా మారిన అభిషేక్ శర్మ.. వరల్డ్ కప్ ఆశలను గాలిలో కలిపేస్తున్నాడా?
టీమిండియాకు భారంగా మారిన అభిషేక్ శర్మ.. వరల్డ్ కప్ ఆశలను గాలిలో కలిపేస్తున్నాడా?
Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యం జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. గతేడాది ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచుల్లో సిక్సర్ల వర్షం కురిపించిన ఈ కుర్రాడు, ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో మాత్రం అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ (యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన అభిషేక్, సూపర్-8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు తన 9వ బంతికి ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.
అభిషేక్ శర్మ గణాంకాలను గమనిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు అతను ఎదుర్కొన్నది కేవలం 20 బంతులు మాత్రమే. కానీ ఈ 20 బంతుల్లోనే అతను 4 సార్లు అవుట్ అయ్యాడు. అంటే సగటున ప్రతి 5 బంతులకు ఒకసారి వికెట్ సమర్పించుకుంటున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 12 బంతులు ఆడి 15 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే అవుట్ అయ్యాడు. భారీ లక్ష్య ఛేదనలో జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాల్సిన ఓపెనర్, ఇలా బాధ్యతారాహిత్యంగా పెవిలియన్ చేరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అభిషేక్ శర్మ ఫామ్ కేవలం ఈ వరల్డ్ కప్‌లోనే కాదు, 2026 ఏడాది మొత్తంలోనూ ఆందోళనకరంగా ఉంది. ఈ సంవత్సరంలో అతను ఆడిన టీ20ల్లో ఇప్పటివరకు 5 సార్లు సున్నాకే అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్‌పై రెండుసార్లు డకౌట్ అవ్వగా, వరల్డ్ కప్‌లో యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై సున్నా చుట్టేశాడు. గత ఏడాది తన బ్యాటింగ్‌లో కనిపించిన ఆ పదును, వేగం ఇప్పుడు పూర్తిగా మాయమయ్యాయి. ప్రత్యర్థి బౌలర్లు అతని బలహీనతలను పసిగట్టడంతో, అభిషేక్ క్రీజులో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు.
2026 సంవత్సరంలో ఇప్పటివరకు అభిషేక్ శర్మ 9 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆశ్చర్యకరంగా ఇన్ని మ్యాచులు ఆడినా అతను కనీసం 200 పరుగుల మైలురాయిని కూడా చేరలేదు. అతని ఖాతాలో ప్రస్తుతం కేవలం 197 పరుగులు మాత్రమే ఉన్నాయి. ఇందులో న్యూజిలాండ్‌పై చేసిన 84 పరుగులే అత్యధికం. ఆ ఒక్క ఇన్నింగ్స్ మినహాయిస్తే, మిగిలిన 8 ఇన్నింగ్స్‌ల్లో అతను చేసి కేవలం 113 పరుగులు మాత్రమే. విఫలమవుతున్నా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతనిపై నమ్మకం ఉంచుతున్నప్పటికీ, తర్వాతి మ్యాచుల్లోనైనా అభిషేక్ పుంజుకోకుంటే తుది జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది.