IND vs SA: మేం దిగుతున్నాం, అహ్మదాబాద్‌లో 1.3 లక్షల మందిని నిశ్శబ్దం చేస్తాం.. భారత్‌కు దక్షిణాఫ్రికా కోచ్ వార్నింగ్!
IND vs SA: టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది.
IND vs SA: మేం దిగుతున్నాం, అహ్మదాబాద్‌లో 1.3 లక్షల మందిని నిశ్శబ్దం చేస్తాం.. భారత్‌కు దక్షిణాఫ్రికా కోచ్ వార్నింగ్!
IND vs SA: టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్లు తమ తమ గ్రూపుల్లో అజేయంగా నిలిచి.. నాలుగుకు నాలుగు మ్యాచ్‌లు గెలిచాయి. దీంతో ఈ పోరు టోర్నీలో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాము అహ్మదాబాద్‌లోని బరిలోకి దిగుతున్నాం అని, మైదానంలోని 1.3 లక్షల మందిని నిశ్శబ్దం చేస్తాం అని సవాల్ చేశాడు. ఒత్తిడి తమకంటే భారత్‌పైనే ఎక్కువగా ఉంటుందని కాన్రాడ్ పేర్కొన్నాడు.
'ప్రపంచ నంబర్ వన్ జట్టుగా భారత్ ఉంది. అయినా కూడా దక్షిణాఫ్రికా నుంచి సవాల్ మాత్రం తప్పదు. భారత్ స్వదేశంలో దాదాపు ఓడిపోదు. అయినప్పటికీ రేపటి మ్యాచ్‌లో మేము గెలవడానికి వస్తున్నాము. అహ్మదాబాద్‌లో జరిగే ఈ కీలక పోరులో లక్షకు పైగా ప్రేక్షకుల మద్దతు భారత్‌కు ఉంటుంది. అయినా సరే మా జట్టు భయపడదు. మేము అహ్మదాబాద్‌కు 1.3 లక్షల గొంతులను నిశ్శబ్దం చేయడానికి వస్తున్నాం' అంటూ షుక్రి కాన్రాడ్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్ బలమైన జట్టని, మంచి కాంబినేషన్‌తో అద్భుతంగా ఆడుతోందని కాన్రాడ్ ప్రశంసించినప్పటికీ.. మ్యాచ్ రోజు ఎవరు మెరుగ్గా ఆడతారో వారే గెలుస్తారని చెప్పాడు. ఈ మ్యాచ్ కేవలం సాధారణ పోటీ కాదని, తమ జట్టు సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం అని పేర్కొన్నాడు. షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యలు ఇప్పుడు మ్యాచ్‌పై ఉత్కంఠను మరింత పెంచాయి.
భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస డకౌట్లపై కూడా షుక్రి కాన్రాడ్ స్పందించాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా డకౌట్ అయిన ఆటగాడు ఒత్తిడిలో ఉంటాడని చెప్పాడు . అయితే భారత జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం అభిషేక్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తుందని, కీలక సమయంలో ఫామ్‌లోకి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తోందన్నాడు. గత ఏడాది చివర్లో భారత్‌లో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలుచుకుంది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. అయినప్పటికీ ద్వైపాక్షిక సిరీస్ ఫలితాలు వరల్డ్‌కప్ మ్యాచ్‌లపై ప్రభావం చూపవని కాన్రాడ్ స్పష్టం చేశాడు. ఇప్పుడు అభిమానులంతా ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? లేక దక్షిణాఫ్రికా కోచ్ చెప్పినట్లే చరిత్ర సృష్టిస్తుందా? అన్నది చూడాలి.