T20 World Cup 2026: భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలుస్తుందా?.. ఎంఎస్ ధోనీ ఏమన్నాడో తెలుసా?
T20 World Cup 2026: భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026 గెలిచే అవకాశాలపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎంఎస్ ధోనీ
T20 World Cup 2026: భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026 గెలిచే అవకాశాలపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జట్టు స్థిరత్వం, ఆటగాళ్ల ఫామ్, టీమ్ కాంబినేషన్‌ను చూస్తే.. పొట్టి ట్రోఫీ గెలిచే అర్హత భారత జట్టుకు ఉందని మహీ అభిప్రాయపడ్డాడు. ఒక్క అదృష్టం కలిసి రాకపోతే తప్ప.. టీమిండియాను ఆపడం చాలా కష్టమని పేర్కొన్నాడు. ప్రస్తుత టీమ్ బాగుందని, ప్లేయర్స్ బాగా ఆడుతున్నారని ధోనీ ప్రశంసించాడు. టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశ ఆరంభం అయింది. ఆదివారం రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికాలు తలపడనున్నాయి.
ఎంఎస్ ధోనీ తాజాగా మాట్లాడుతూ... 'టీ20 ఫార్మాట్‌లో ఫేవరెట్‌గా ఉన్న జట్టే ఎప్పుడూ గెలుస్తుందని చెప్పలేము. ఆ రోజు ఎవరు మెరుగైన క్రికెట్ ఆడతారో వారే మ్యాచ్ గెలుస్తారు. అందుకే చిన్న చిన్న తప్పిదాలు కూడా చేయకుండా జాగ్రత్తపడటం చాలా కీలకం. టీ20 మ్యాచ్‌లో ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చగలదదు. డ్యూ (తేమ) కూడా మ్యాచ్‌పై పెద్ద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా డ్యూ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో టార్గెట్‌ను డిఫెండ్ చేయడం చాలా కష్టం. ముందుగా బ్యాటింగ్ చేసి తర్వాత డ్యూ పరిస్థితుల్లో బౌలింగ్ చేయాల్సి వస్తే.. మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా మారే అవకాశం ఉంటుంది' అని విశ్లేషించాడు.
'భారత జట్టు బలంగా కనిపిస్తోంది. ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. జట్టులో ప్రతి ఒక్కరి పాత్ర స్పష్టంగా ఉంది. ఒకరు విఫలమైనా ఇంకొకరు జట్టును ఆడుకుంటున్నారు. సెమీస్ చేరాలంటే.. తీవ్రంగా శ్రమించాలి. ఈ విషయంలో భారత జట్టుకు ఎలాంటి డోకా లేదు. ట్రోఫీ గెలిచే అర్హత భారత జట్టుకు ఉంది. అదృష్టం కలిసి రాకపోతే తప్ప టీమిండియాను ఆపడం కష్టం. టీమ్‌కు శుభాకాంక్షలు' అని ఎంఎస్ ధోనీ తెలిపాడు. 2007 ప్రపంచ కప్ మహీ సారథ్యంలోనే భారత్ గెలిచిన విషయం తెలిసిందే. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా మరోసారి విజేతగా నిలిచింది. ఈసారి సూర్యకుమార్ సారథ్యంలో కూడా భారత్ కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.