AUS vs OMAN : వరల్డ్ కప్ చరిత్రలో ఆసీస్ సరికొత్త చరిత్ర.. కేవలం 58 బంతుల్లోనే ఒమన్‎ను మట్టికరిపించిన కంగారూలు

వరల్డ్ కప్ చరిత్రలో ఆసీస్ సరికొత్త చరిత్ర.. కేవలం 58 బంతుల్లోనే ఒమన్‎ను మట్టికరిపించిన కంగారూలు

Update: 2026-02-21 01:49 GMT

AUS vs OMAN : టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ టోర్నీలో అనూహ్యంగా మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా, వెళ్తూ వెళ్తూ తన కోపాన్నంతా ఒమన్‌పై చూపించింది. పల్లెకెలె వేదికగా శుక్రవారం జరిగిన నామమాత్రపు పోరులో కంగారూలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 58 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి ఒమన్‌ను మట్టికరిపించారు. ఈ క్రమంలో వరల్డ్ కప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన ప్రపంచ రికార్డును ఆసీస్ బౌలర్లు నెలకొల్పారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఓమన్‌కు మొదటి బంతికే షాక్ తగిలింది. ఆసీస్ పేసర్ జేవియర్ బార్ట్లెట్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ఆమిర్ కలీమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అక్కడి నుంచి ఓమన్ పతనం మొదలైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒమన్‌ కోల్పోయిన మొదటి నాలుగు వికెట్లు కూడా క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక జట్టు ఇన్నింగ్స్‌లో మొదటి నాలుగు వికెట్లు బౌల్డ్ కావడం ఇదే తొలిసారి. ఆడమ్ జంపా (4 వికెట్లు) తన స్పిన్ మాయాజాలంతో ఓమన్‌ను కోలుకోకుండా చేయగా, గ్లెన్ మాక్స్‌వెల్, బార్ట్లెట్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో ఒమన్‌ 16.2 ఓవర్లలో కేవలం 104 పరుగులకే కుప్పకూలింది.

105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు కెప్టెన్ మిచెల్ మార్ష్ వెన్నుముకగా నిలిచాడు. గాయం కారణంగా ఈ టోర్నీలో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన మార్ష్, ఆ లోటును ఈ మ్యాచ్‌తో తీర్చుకున్నాడు. ఒమన్‌ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (32)తో కలిసి మొదటి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేవలం 9.4 ఓవర్లలోనే (58 బంతులు) ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. మార్ష్ 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ గెలుపు ఆస్ట్రేలియాకు కాస్త ఊరటనిచ్చినప్పటికీ, టోర్నీ నుంచి నిష్క్రమించిన బాధ మాత్రం అలాగే ఉంది. గ్రూప్-బి నుంచి ఇప్పటికే సూపర్-8 జట్లు ఖరారు కావడంతో ఈ మ్యాచ్ కేవలం ఒక లాంఛనంగానే మిగిలిపోయింది. గత మూడు రోజులుగా జరిగిన సమీకరణాల వల్ల ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లడం ఖాయమైంది. ఒకప్పుడు ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కంగారూలు, ఇలా పసికూనపై గెలిచి తమ పరువు కాపాడుకోవాల్సి రావడం వారి అభిమానులను కలచివేస్తోంది. ఏది ఏమైనా వెళ్తూ వెళ్తూ ఒక వరల్డ్ రికార్డును తమ ఖాతాలో వేసుకుని ఆస్ట్రేలియా తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగించింది.

Tags:    

Similar News