IND vs NED : అహ్మదాబాద్‌లో దూబే శివతాండవం.. 5 క్యాచ్‌లు వదిలేసినా నెదర్లాండ్స్ పై గెలిచిన భారత్
అహ్మదాబాద్‌లో దూబే శివతాండవం.. 5 క్యాచ్‌లు వదిలేసినా నెదర్లాండ్స్ పై గెలిచిన భారత్
IND vs NED : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా నాలుగో గెలుపును ఖాతాలో వేసుకున్న భారత్, గ్రూప్ స్టేజ్‌లో అజేయ జట్టుగా నిలిచి సగర్వంగా సూపర్-8 రౌండ్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌తో భారత జట్టు తన లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు, శివం దూబే రూపంలో ఒక బలమైన మ్యాచ్ విన్నర్‌ను మళ్ళీ కనిపెట్టింది.
ఈ విజయంలో ఆల్‌రౌండర్ శివం దూబే వెన్నెముకగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌లో శివాలెత్తిన దూబే.. కేవలం 31 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 66 పరుగులు చేసి భారత్ 193 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం బ్యాట్‌తోనే కాదు, బంతితోనూ మెరిశాడు. నెదర్లాండ్స్ విజయానికి చివరి ఓవర్లో 28 పరుగులు కావాల్సిన దశలో, ఒత్తిడిని దరిచేరనీయకుండా బౌలింగ్ చేసి భారత్‌ను గెలిపించాడు. దూబే మొత్తంగా 2 వికెట్లు తీయగా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో డచ్ జట్టు నడ్డి విరిచాడు. బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.
అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భారత ఫీల్డర్లు ఏకంగా 5 క్యాచ్‌లను నేలపాలు చేశారు. అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి మేటి ఫీల్డర్లు కూడా సులభమైన క్యాచ్‌లను వదిలేశారు. అదృష్టవశాత్తూ నెదర్లాండ్స్ బ్యాటర్లు ఆ అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు కానీ, సూపర్-8లో దక్షిణాఫ్రికా వంటి జట్లపై ఇలాంటి తప్పిదాలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే సూపర్-8 బెర్తు ఖరారు చేసుకున్న భారత్, గ్రూప్-1లో నిలిచింది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 22న జరగబోయే సూపర్-8 తొలి మ్యాచ్‌లో బలమైన సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. గ్రూప్ దశలో చూపిన అదే జోరును కంటిన్యూ చేస్తూ, ఫీల్డింగ్ తప్పిదాలను సరిదిద్దుకుంటే వరల్డ్ కప్ మన సొంతం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.