Zimbabwe-Super 8: టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. సూపర్-8కు జింబాబ్వే, టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్
టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్, ప్రపంచ క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఏలిన ఆస్ట్రేలియా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Zimbabwe-Super 8: టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. సూపర్-8కు జింబాబ్వే, టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్
టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్, ప్రపంచ క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఏలిన ఆస్ట్రేలియా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంలకు పల్లెకెలెలో ఐర్లాండ్, జింబాబ్వే మధ్య మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. వర్షం కారణంగా టాస్ పడలేదు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. వరుణుడు ఇంతకీ కరుణించకపోవడంతో.. మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఐర్లాండ్, జింబాబ్వే జట్లలకు చెరో పాయింట్ దక్కింది. ఈ పరిణామంతో సూపర్-8కు జింబాబ్వే దూసుకెళ్ళగా.. ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టీ20 ప్రపంచకప్ గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, శ్రీలంకలతో పాటు పసికూనలు జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ జట్లు ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడిన ఒమన్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీలంక మూడు వరుస విజయాలతో సూపర్ 8కి దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా ఆడిన మూడింటిలో ఒకటే గెలిచి.. సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి.. సూపర్ 8 పోరులో నిలిచింది. గ్రూప్-Bలో కీలకమైన మ్యాచ్‌గా ఐర్లాండ్–జింబాబ్వే మ్యాచ్ మారింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడితే ఆసీస్ జట్టుకు అవకాశాలు ఉండేవి. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో జింబాబ్వే ఖాతాలోకి ఒక పాయింట్ చేరింది. దీంతో జింబాబ్వే 5 పాయింట్లతో సూపర్ 8కు అర్హత సాధించింది.
ఫిబ్రవరి 20న ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించినా.. కేవలం నాలుగు పాయింట్లే ఉంటాయి. దాంతో గ్రూప్ బి నుంచి పసికూన ఐర్లాండ్ సహా పటిష్ట ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టాయి. ఇక ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్ సూపర్ 8కు వెళ్ళింది. మరో స్థానం కోసం పాకిస్థాన్, యూఎస్‌ఏ పోటీపడుతున్నాయి. గ్రూప్ సీ నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్... గ్రూప్ డీ నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్ 8కు అర్హత సాధించాయి.
ఈ పరిణామం ఆస్ట్రేలియా జట్టుకు తీవ్ర నిరాశ కలిగించింది. బలమైన జట్టుగా భావించిన ఆస్ట్రేలియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసీస్ ఇంటికి వెళ్లడంతో టీమిండియా ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఐసీసీ ఫైనల్లో భారత జట్టుకు పెద్ద అడ్డంకి ఆస్ట్రేలియానే కాబట్టి. ఇలా వర్షం ఒక మ్యాచ్ ఫలితాన్ని మాత్రమే కాదు.. మొత్తం గ్రూప్ పరిస్థితినే మార్చేసింది. జింబాబ్వే అద్భుత ఆటతో సూపర్-8కు చేరింది. మరి సూపర్-8 ఏమైనా షాకులు ఇస్తుందో చూడాలి.