SL vs AUS : సెంచరీతో చెలరేగిన లంక ఓపెనర్.. సూపర్-8లోకి శ్రీలంక.. ఇంటి దారి పట్టిన ఆస్ట్రేలియా
సెంచరీతో చెలరేగిన లంక ఓపెనర్.. సూపర్-8లోకి శ్రీలంక.. ఇంటి దారి పట్టిన ఆస్ట్రేలియా
SL vs AUS : టీ20 ప్రపంచకప్ 2026 ఆతిథ్య జట్టు శ్రీలంక తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. పల్లెకెలె వేదికగా సోమవారం జరిగిన కీలక పోరులో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి, ఘనంగా సూపర్-8 రౌండ్‌లోకి దూసుకెళ్లింది. లంక ఓపెనర్ పథుమ్ నిస్సంక విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో, ఆసీస్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యం నీరుగారిపోయింది. ఈ ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా నిస్సంక రికార్డు సృష్టించడమే కాకుండా, తన జట్టును సూపర్-8కు చేర్చి ఆస్ట్రేలియాను టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి నెట్టేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు కెప్టెన్ మిచెల్ మార్ష్, స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ లంక బౌలర్లపై విరుచుకుపడి కేవలం 8.3 ఓవర్లలోనే 104 పరుగులు పిండుకున్నారు. అయితే, వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. ఒక దశలో భారీ స్కోరు చేసేలా కనిపించిన కంగారూలు, తర్వాతి 4 ఓవర్లలోనే 4 కీలక వికెట్లు కోల్పోయారు. చివర్లో కేవలం 21 పరుగుల వ్యవధిలోనే మిగిలిన 5 వికెట్లు సమర్పించుకుని 181 పరుగులకే ఆలౌట్ అయ్యారు. లంక బౌలర్లలో దుషన్ హేమంత 3 వికెట్లు తీసి ఆసీస్ నడ్డి విరిచాడు.
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే కుసాల్ పెరీరా వికెట్ కోల్పోయి షాక్ తగిలింది. కానీ, పథుమ్ నిస్సంక మాత్రం అస్సలు తగ్గలేదు. కుసాల్ మెండిస్‌తో కలిసి ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడాడు. మెండిస్ ఈ టోర్నీలో వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించి అవుట్ అవ్వగా, నిస్సంక మాత్రం క్రీజులో పాతుకుపోయి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. కేవలం 52 బంతుల్లోనే అజేయ సెంచరీ పూర్తి చేసి, మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే లంకకు అద్భుత విజయాన్ని అందించాడు. పవన్ రత్నాయకే (28 నాటౌట్) నిస్సంకకు మంచి సహకారాన్ని అందించాడు.
వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్న ఆస్ట్రేలియా ఇప్పుడు టోర్నీ నుంచి తట్టాబుట్టా సర్దుకునే ప్రమాదంలో పడింది. జింబాబ్వే చేతిలో ఓటమి, ఇప్పుడు లంక చేతిలో పరాజయంతో ఆసీస్ కేవలం 2 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే గనుక ఐర్లాండ్‌ను ఓడిస్తే, ఆస్ట్రేలియా అధికారికంగా ఈ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిస్తేనే కంగారూలకు తదుపరి రౌండ్ వెళ్లే కొద్దిపాటి అవకాశాలు ఉంటాయి.
సొంత గడ్డపై ఆడుతున్న శ్రీలంక వరుసగా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమతూకంతో కనిపిస్తున్న లంక జట్టు ఈసారి కప్పు కొట్టే ఫేవరెట్లలో ఒకటిగా నిలుస్తోంది. నిస్సంక ఫామ్ ఆ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది. సూపర్-8లో భారత్, దక్షిణాఫ్రికా వంటి జట్లతో తలపడేందుకు లంక సింహాలు సిద్ధమవుతున్నాయి.