IND VS SA: అమ్మకే ఎక్కువ టెన్షన్.. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై మోర్కెల్ బ్రదర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో సూపర్-8 పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా టీమ్స్ తలపడనున్నాయి.

Update: 2026-02-19 14:30 GMT

IND VS SA: అమ్మకే ఎక్కువ టెన్షన్.. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై మోర్కెల్ బ్రదర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో సూపర్-8 పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా టీమ్స్ తలపడనున్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ మాదిరే దక్షిణాఫ్రికా కూడా లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచింది. ఇరు జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నాయి. దాంతో సూపర్-8 పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీలు, మోర్కెల్ బ్రదర్స్ (అల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ కంటే అమ్మకే ఎక్కువ టెన్షన్ అని, ఏ జట్టుకు సపోర్ట్ చేయాలో ఆమెకు అర్ధం కావడం లేదని చెప్పారు.

టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ... 'భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ విషయంలో నాకంటే అమ్మకే ఎక్కువ టెన్షన్ ఉంది. ఏ జట్టుకు సపోర్ట్ చేయాలో అమ్మకు అర్థం కావడం లేదు. రెండు జట్లతోనూ తమకు అనుబంధం ఉండటంతో ఇంట్లో సరదా చర్చలు జరుగుతున్నాయి' అని నవ్వుతూ చెప్పాడు. మరోవైపు తాజా ప్రెస్ మీట్‌లో దక్షిణాఫ్రికా స్పెషలిస్ట్ కన్సల్టెంట్ అల్బీ మోర్కెల్ అందరినీ నవ్వించాడు. తన తమ్ముడు, భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్తో కోచింగ్ ఐడియాలు షేర్ చేసుకుంటారా అని అడగగా.. 'మేమిద్దరం మాట్లాడుకోము (నవ్వుతూ). మ్యాచ్ నేపథ్యంలో నిజానికి మా అమ్మకే ఎక్కువ టెన్షన్. భారత్, దక్షిణాఫ్రికా.. ఎవరికీ సపోర్ట్ చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు' అని చెప్పాడు.

అల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాళ్లు. అంతేకాదు ఇద్దరు సొంత అన్నదమ్ములు. రిటైర్మెంట్ అనంతరం ఇద్దరు కూడా కోచింగ్ వైపు వెళ్లారు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోర్నీ సపోర్ట్ స్టాఫ్‌లో చేరాడు. భారత పేస్ బౌలర్ల ప్రదర్శనను మెరుగుపరచడంలో ఆయనది కీలక పాత్ర. ముఖ్యంగా ఆటగాళ్ల పాత్రలను మెరుగుపరిచే విషయంలో అతడు సక్సెస్ అయ్యాడు. మరోవైపు అల్బీ కూడా దక్షిణాఫ్రికా జట్టుకు సేవలు అందిస్తున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ సూచనలతో పాటు ప్రధానంగా బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు. ఆల్‌రౌండర్లు, స్వింగ్ బౌలర్లతో ప్రత్యేకంగా పని చేస్తున్నాడు. ఈ మార్పుల ఫలితంగా జట్టు పేస్ దళం బలంగా మారింది.

భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉత్కంఠభరిత పోరాటమే. ఈసారి కూడా రెండు జట్లు బలంగా ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మోర్కెల్ బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలు మ్యాచ్‌కు ముందు ఉత్కంఠను మరింత పెంచాయి. మొత్తంగా చూస్తే ఈ పోరు కేవలం రెండు జట్ల మధ్య మ్యాచ్ మాత్రమే కాదు.. అభిమానులు, మాజీ ఆటగాళ్లు, కుటుంబ సభ్యుల వరకు అందరినీ ఉత్కంఠలో ముంచెత్తే క్రికెట్ సమరం కానుంది.

Tags:    

Similar News