AFG vs CAN : చెపాక్‌లో అఫ్గాన్ స్పిన్ మాయాజాలం.. 82 పరుగుల తేడాతో ఓడిన కెనడా

చెపాక్‌లో అఫ్గాన్ స్పిన్ మాయాజాలం.. 82 పరుగుల తేడాతో ఓడిన కెనడా

Update: 2026-02-20 00:40 GMT

AFG vs CAN : చెపాక్‌లో అఫ్గాన్ స్పిన్ మాయాజాలం.. 82 పరుగుల తేడాతో ఓడిన కెనడా

AFG vs CAN: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు ఘనవిజయంతో టోర్నీకి వీడ్కోలు పలికింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన అఫ్గాన్ జట్టు, తన ఆఖరి మ్యాచ్‌లో కెనడాను 82 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన ఈ పోరులో అఫ్గాన్ ఆటగాళ్లు అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ విశ్వరూపం చూపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు సాధించగా, లక్ష్య ఛేదనలో కెనడా 118 పరుగులకే చాపచుట్టేసింది.

బ్యాటింగ్‌లో అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ కెనడా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరోవైపు సెదికుల్లా అటల్ 44 పరుగులతో రాణించడంతో అఫ్గాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడాకు ఆరంభం బాగానే ఉన్నా, అఫ్గాన్ స్పిన్ త్రయం రాకతో కథ మారిపోయింది. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తమ స్పిన్ మాయాజాలంతో కెనడా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.

ముఖ్యంగా సీనియర్ ప్లేయర్ మహమ్మద్ నబీ తన స్పెల్‌తో అద్భుతం చేశాడు. 4 ఓవర్లు వేసిన నబీ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ 19 పరుగులకు 2 వికెట్లు తీయగా, ముజీబ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ ముగ్గురు స్పిన్నర్లు కలిపి 12 ఓవర్లలో కేవలం 50 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టడం గమనార్హం. గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన కెనడా ప్లేయర్ యువరాజ్ సామ్రా ఈ మ్యాచ్‌లో కేవలం 17 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ గెలుపుతో అఫ్గాన్ గ్రూప్-Dలో 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, కెనడా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిదారి పట్టింది.

Tags:    

Similar News