T20 World Cup 2026 : సూపర్-8 మ్యాచ్‌లు అన్నీ రద్దయితే సెమీస్‌కు వెళ్లేది ఎవరు? ఐసీసీ కొత్త నిబంధనలు ఇవే

సూపర్-8 మ్యాచ్‌లు అన్నీ రద్దయితే సెమీస్‌కు వెళ్లేది ఎవరు? ఐసీసీ కొత్త నిబంధనలు ఇవే

Update: 2026-02-22 01:46 GMT

 T20 World Cup 2026 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన సూపర్-8 దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్‌లో సత్తా చాటిన టాప్-8 జట్లు ఇప్పుడు సెమీఫైనల్ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. అయితే, ఈ కీలక దశ ఆరంభమే వర్షం సెగతో మొదలైంది. కొలంబోలో జరగాల్సిన పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో ఒకవేళ సూపర్-8లో వర్షం కారణంగా అన్ని మ్యాచ్‌లు రద్దయితే పరిస్థితి ఏంటి? సెమీస్‌కు వెళ్లే జట్లను ఎలా నిర్ణయిస్తారు? పాకిస్థాన్ వంటి జట్ల భవితవ్యం ఏమవుతుంది? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

సూపర్-8 గ్రూపుల విభజన ఇలా..

ఈ రౌండ్‌లో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్-1: భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే.

గ్రూప్-2: ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక.

ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. అయితే గ్రూప్-2 మ్యాచ్‌లు జరుగుతున్న శ్రీలంకలో రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఏ మ్యాచ్ జరగకుండా పాయింట్లు సమంగా వస్తే ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఐసీసీ మ్యాజిక్ రూల్స్ ఇవే

సాధారణంగా పాయింట్లు సమానమైనప్పుడు నెట్ రన్ రేట్ చూస్తారు. కానీ అసలు మ్యాచ్‌లే జరగకపోతే రన్ రేట్ లెక్కలోకి రాదు. ఇలాంటి అసాధారణ పరిస్థితుల కోసం ఐసీసీ ముందే కొన్ని నిబంధనలను రూపొందించింది.

* మొదట పాయింట్ల ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు.

* పాయింట్లు సమానమైతే, సూపర్-8లో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుకు ప్రాధాన్యత ఉంటుంది.

* అది కూడా సాధ్యం కాకపోతే మాత్రమే నెట్ రన్ రేట్ చూస్తారు.

* ఒకవేళ ఒక్క మ్యాచ్ కూడా జరగకుండా అన్ని రద్దయితే, టోర్నీ ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి 6 నాటి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా సెమీఫైనలిస్టులను నిర్ణయిస్తారు.

పాకిస్థాన్ అవుట్.. భారత్ సేఫ్

ఒకవేళ వర్షం కారణంగా గ్రూప్-2లోని అన్ని మ్యాచ్‌లు రద్దయితే, అందరికీ తలో 3 పాయింట్లు వస్తాయి. అప్పుడు ర్యాంకింగ్స్ ప్రకారం ఇంగ్లాండ్ (ర్యాంక్ 3), న్యూజిలాండ్ (ర్యాంక్ 4) సెమీస్‌కు వెళ్తాయి. పాకిస్థాన్ (ర్యాంక్ 6), శ్రీలంక (ర్యాంక్ 8) టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అదే విధంగా గ్రూప్-1లో కూడా మ్యాచ్‌లు రద్దయితే నంబర్ వన్ ర్యాంకింగ్‌లో ఉన్న భారత్, ఐదో ర్యాంక్‌లో ఉన్న దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. వెస్టిండీస్ (ర్యాంక్ 7), జింబాబ్వే (ర్యాంక్ 12) ఇంటికి వెళ్లక తప్పదు. అంటే, ఒక్క మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్ ఇంటికి చేరే ప్రమాదం పొంచి ఉందన్నమాట.

Tags:    

Similar News