T20 World Cup 2026 : మారణహోమం సృష్టించిన విండీస్.. భారత్ సెమీస్ కల కల్లలేనా?
మారణహోమం సృష్టించిన విండీస్.. భారత్ సెమీస్ కల కల్లలేనా?
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో ఈక్వేషన్స్ క్షణక్షణం మారిపోతున్నాయి. గ్రూప్-A సూపర్-8 పోరు ఇప్పుడు ఒక రసవత్తర ఘట్టానికి చేరుకుంది. జింబాబ్వేపై వెస్టిండీస్ సాధించిన భారీ విజయం టీమిండియా ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తోంది. విండీస్ కేవలం గెలవడమే కాదు, తమ నెట్ రన్ రేట్‌ను ఆకాశానికి తీసుకెళ్లింది. ప్రస్తుతం వెస్టిండీస్ రన్ రేట్ చూస్తుంటే అది రన్ రేట్ లా కాకుండా, ఏదో బౌలర్ వేసిన ఎకానమీ రేట్ లా కనిపిస్తుండటం విశేషం. ఏకంగా 5.35 నెట్ రన్ రేట్‌తో విండీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇది భారత జట్టు సెమీస్ అవకాశాలను ప్రమాదంలో పడేసింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికను గమనిస్తే.. వెస్టిండీస్, సౌతాఫ్రికా చెరో రెండు పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే రన్ రేట్ విషయంలో వెస్టిండీస్ (+5.35) అందరికంటే ముందుండగా, సౌతాఫ్రికా (+3.8) రెండో స్థానంలో ఉంది. జింబాబ్వేపై 107 పరుగుల తేడాతో గెలవడంతో విండీస్‌కు ఈ భారీ రన్ రేట్ లభించింది. మరోవైపు, సౌతాఫ్రికా చేతిలో 76 పరుగులతో ఓడిపోయిన భారత్ రన్ రేట్ ప్రస్తుతం -3.8గా ఉంది. జింబాబ్వే ఘోరంగా ఓడిపోవడం వల్ల భారత్ పట్టికలో ఆఖరి స్థానం నుంచి మూడో స్థానానికి చేరినా, ప్రమాదం మాత్రం ఇంకా పొంచే ఉంది.
టీమిండియా సెమీస్ చేరాలంటే ఇప్పుడు అద్భుతం జరగాలి. ముందుగా ఫిబ్రవరి 26న జింబాబ్వేపై, మార్చి 1న వెస్టిండీస్‌పై భారత్ తప్పనిసరిగా గెలవాలి. కేవలం గెలిస్తేనే సరిపోదు, రన్ రేట్ భారీగా పెంచుకోవాలి. ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌ను ఓడించాలి. ఒకవేళ వెస్టిండీస్ గనుక సౌతాఫ్రికాను ఓడిస్తే, అప్పుడు విండీస్ ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. అప్పుడు భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌లు గెలిచినా, రన్ రేట్ విషయంలో విండీస్‌ను దాటడం అసాధ్యం కాబట్టి, సఫారీలతో పోటీ పడాల్సి వస్తుంది.
ఒకవేళ భారత్ తన తదుపరి మ్యాచ్‌లలో నెమ్మదిగా ఆడి గెలిచినా ఉపయోగం ఉండదు. వెస్టిండీస్ సాధించిన ఈ భారీ రన్ రేట్ (+5.35) ఒక రక్షణ కవచంలా ఆ జట్టుకు సెమీస్ టికెట్ ఇచ్చేలా ఉంది. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు జింబాబ్వేను చిత్తుచిత్తుగా ఓడించడమే కాకుండా, వెస్టిండీస్‌తో జరిగే ఆఖరి పోరులో గెలిచి తమ సత్తా చాటాలి. లేదంటే సూపర్ 8 రౌండ్ నుంచే భారత్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జింబాబ్వే పై విండీస్ ఉగ్రరూపం చూస్తుంటే భారత అభిమానుల్లో గుబులు మొదలైంది.