WI vs ZIM : సిక్సర్ల సునామీ.. 254 పరుగులు.. వరల్డ్ కప్ లో వెస్టిండీస్ జింబాబ్వే పై చారిత్రాత్మక విజయం
సిక్సర్ల సునామీ.. 254 పరుగులు.. వరల్డ్ కప్ లో వెస్టిండీస్ జింబాబ్వే పై చారిత్రాత్మక విజయం
WI vs ZIM :ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా వెస్టిండీస్ జట్టు విధ్వంసం సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 పోరులో జింబాబ్వేను విండీస్ ఆటగాళ్లు ఊచకోత కోశారు. కేవలం మ్యాచ్ గెలవడమే కాదు, ఏకంగా 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వెస్టిండీస్‌కు ఇది రెండో అతిపెద్ద విజయం. ఈ భారీ గెలుపుతో విండీస్ సెమీఫైనల్ దిశగా బలమైన అడుగు వేయడమే కాకుండా, టీమిండియా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లేలా నెట్ రన్ రేట్‌ను అమాంతం పెంచేసుకుంది.
వెస్టిండీస్ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించడంతో వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. షిమ్రాన్ హెట్మెయర్ కేవలం 34 బంతుల్లో 85 పరుగులు చేసి విలయతాండవం చేయగా, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 35 బంతుల్లో 59 పరుగులతో మెరిశాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 సిక్సర్లు నమోదయ్యాయంటే వారి బ్యాటింగ్ ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. వెస్టిండీస్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. పవర్ ప్లే ముగిసేలోపే 50 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడంతో 100 పరుగులు దాటకముందే సగం జట్టు పెవిలియన్‌కు క్యూ కట్టింది. ఎనిమిదో నంబర్ బ్యాటర్ బ్రాడ్ ఇవాన్స్ (43 పరుగులు) పోరాడటంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చివరకు 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. విండీస్ బౌలర్లలో గూడాకేష్ మోతీ 4 వికెట్లతో చెలరేగగా, అకీల హుస్సేన్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఈ విజయంతో వెస్టిండీస్ వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచి (గ్రూప్ స్టేజ్ 4 + సూపర్-8 లో 1) రికార్డు సృష్టించింది. ప్రస్తుతం గ్రూప్-A పాయింట్ల పట్టికలో విండీస్ అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, వారి నెట్ రన్ రేట్ +5 దాటిపోయింది. ఇది టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే భారత్ నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. ఒకవేళ భారత్ తన తదుపరి మ్యాచ్‌లు గెలిచినా, రన్ రేట్ విషయంలో వెస్టిండీస్‌ను దాటడం ఇప్పుడు దాదాపు అసాధ్యం. ఇప్పుడు భారత్ సెమీస్ చేరాలంటే సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌ను ఓడించాలని అభిమానులు కోరుకుంటున్నారు.