Smriti Mandhana : స్మృతి మంధాన విశ్వరూపం..16 బౌండరీలతో ఢిల్లీపై విరుచుకుపడ్డ ఆర్‌సీబీ కెప్టెన్
Smriti Mandhana : మహిళా ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ యాత్ర కొనసాగుతోంది.
Smriti Mandhana : స్మృతి మంధాన విశ్వరూపం..16 బౌండరీలతో ఢిల్లీపై విరుచుకుపడ్డ ఆర్‌సీబీ కెప్టెన్
Smriti Mandhana: మహిళా ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ యాత్ర కొనసాగుతోంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన 11వ మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. తన ప్రాణ స్నేహితురాలు జెమీమా రోడ్రిగ్స్ కెప్టెన్సీలోని ఢిల్లీ టీమ్‌ను మంధాన సేన చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన ఆడిన మెరుపు ఇన్నింగ్స్ స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. అయితే ఆరంభంలోనే ఢిల్లీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేవలం 10 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఓపెనర్ షెఫాలీ వర్మ మొండిగా పోరాడింది. 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. చివర్లో లూసీ హామిల్టన్ (36) వేగంగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేయగలిగింది. ఆర్‌సీబీ బౌలర్లలో లారెన్ బెల్, సయాలీ సత్ఘరే చెరో 3 వికెట్లు తీసి ఢిల్లీ నడ్డి విరిచారు.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే ఒక వికెట్ పడినా.. కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఆడింది. ఢిల్లీ బౌలర్లను ఉతికేస్తూ కేవలం 61 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు చేసింది. అంటే ఏకంగా 16 బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. జార్జియా వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో స్మృతి అవుట్ అయింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా సెంచరీ సాధించలేకపోయారు, ఆ రికార్డును స్మృతి అందుకుంటుందని ఆశించిన అభిమానులకు స్వల్ప నిరాశ తప్పలేదు.
స్మృతి అవుట్ అయినా అప్పటికే ఆర్‌సీబీ విజయం ఖాయమైంది. జార్జియా వాల్ (54 నాటౌట్) హాఫ్ సెంచరీతో మ్యాచ్‌ను ముగించింది. దీంతో ఆర్‌సీబీ 18.2 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఇది నాలుగో విజయం. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు సొంత స్నేహితురాలు జెమీమా కళ్ల ముందే స్మృతి మంధాన మ్యాచ్‌ను లాగేసుకోవడం విశేషం.