Shubman Gill : టీ20 ప్రపంచకప్‌కు ముందు గిల్ కు కీలక బాధ్యతలు
టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కెరీర్ ఇప్పుడు వేగంగా దూసుకుపోతోంది. భారత జట్టులో కీలక బ్యాట్స్‌మెన్‌గా స్థిరపడిన గిల్, ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నాడు.
Shubman Gill : టీ20 ప్రపంచకప్‌కు ముందు గిల్ కు కీలక బాధ్యతలు
Shubman Gill : టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కెరీర్ ఇప్పుడు వేగంగా దూసుకుపోతోంది. భారత జట్టులో కీలక బ్యాట్స్‌మెన్‌గా స్థిరపడిన గిల్, ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నాడు. తన అద్భుతమైన ప్రదర్శన, నాయకత్వ పటిమకు గాను ఇప్పుడు అతనికి ఒక పెద్ద గిఫ్ట్ దక్కబోతుంది. త్వరలో జరగబోయే ఆసియా కప్‌లో గిల్ టీ20 జట్టు వైస్-కెప్టెన్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ చూపించిన అసాధారణ ప్రతిభే ఈ కీలక నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలవడమే కాకుండా, జట్టును నడిపించి సిరీస్‌ను 2-2తో డ్రా చేయడంలో సఫలమయ్యాడు. ఈ ప్రదర్శనతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గిల్‌కు ఈ ముఖ్యమైన బాధ్యతను అప్పగించాలని నిర్ణయించుకున్నారని రెవ్‌స్పోర్ట్స్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది.
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో గిల్ టీమిండియా వైస్-కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు జట్టు యాజమాన్యం గిల్‌ను కెప్టెన్ గా చూస్తుందనే సంకేతాలు ఇస్తోంది. గిల్ ఇప్పటికే వన్డే జట్టు వైస్-కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఇప్పుడు టీ20 జట్టుకు కూడా వైస్-కెప్టెన్‌గా నియమితులు కావడం ద్వారా మూడు ఫార్మాట్లలోనూ అతనికి ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టమవుతోంది.
25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ దాదాపు ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో ఆడలేదు. చివరిసారిగా 2024 ఆగస్టులో శ్రీలంక పర్యటనలో టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ క్రికెట్, ఐపీఎల్‌లో అతని అద్భుతమైన ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని అతన్ని మళ్లీ టీ20 జట్టులోకి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు గిల్ భారత్ తరపున 21 టీ20 మ్యాచ్‌లు ఆడి 30 సగటుతో 578 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన కొద్దిమంది భారత బ్యాట్స్‌మెన్‌లలో గిల్ ఒకడు. భవిష్యత్తులో ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత వన్డే ఫార్మాట్‌లోనూ టీమిండియా పగ్గాలు అందుకునే అవకాశం గిల్‌కు ఉందని నిపుణులు భావిస్తున్నారు.