Rohit Sharma : 2027 వన్డే వరల్డ్ కప్‌పై రోహిత్ శర్మ మనసులో మాట.. అభిమానులకు పండుగలాంటి వార్త
Rohit Sharma : ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన భవిష్యత్తు ప్రణాళికలపై కీలకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Rohit Sharma : 2027 వన్డే వరల్డ్ కప్‌పై రోహిత్ శర్మ మనసులో మాట.. అభిమానులకు పండుగలాంటి వార్త
Rohit Sharma: ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన భవిష్యత్తు ప్రణాళికలపై కీలకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడతారా లేదా అనే సందేహాలు ఉన్న నేపథ్యంలో హిట్‌మ్యాన్ స్వయంగా బదులిచ్చారు. తాను 2027లో జరిగే వరల్డ్ కప్‌లో ఆడాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన భారత క్రికెట్ అభిమానులకు పండుగలాంటి వార్త. మేక్ ఏ విష్ చైల్డ్ అనే సంస్థతో కలిసి ఒక చిన్నారి అభిమానిని రోహిత్ శర్మ కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయి, కప్ గెలవాలనే అసంపూర్ణ కల మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఆ కల నెరవేర్చుకోవాలనే కోరికను రోహిత్ మరోసారి వ్యక్తం చేశారు.
వీడియోలో ఆ చిన్నారి రోహిత్ శర్మను.. తరువాత వరల్డ్ కప్ ఎప్పుడు? అని అడిగాడు. రోహిత్ దానికి 2027 అని సమాధానమిచ్చారు. ఆ తరువాత, ఆ చిన్నారి మీరు 2027 వరల్డ్ కప్‌లో ఆడతారా? అని అడగ్గా... రోహిత్ శర్మ ఇచ్చిన సమాధానం విని అభిమానులు సంతోషంలో మునిగిపోతారు. అవును, నేను వరల్డ్ కప్‌లో ఆడాలని కోరుకుంటున్నాను అని రోహిత్ స్పష్టం చేశారు. వన్డే వరల్డ్ కప్‌ను గెలవడం తన కల అని కూడా ఆ చిన్నారికి రోహిత్ తెలిపారు.
రోహిత్ శర్మ ఇప్పటివరకు మూడు వన్డే వరల్డ్ కప్‌లలో పాల్గొన్నారు. 2015, 2019, 2023 వన్డే వరల్డ్ కప్‌లలో ఆడిన రోహిత్ మొత్తం 28 మ్యాచుల్లో 60.57 అద్భుతమైన సగటుతో 1,575 పరుగులు సాధించారు. ఇందులో 7 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2019 వరల్డ్ కప్‌లో ఏకంగా 5 సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించారు. 2023లో ఆయన కెప్టెన్సీలో భారత జట్టు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్ వరకు చేరింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తప్పలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో ఉన్నారు. అక్కడ అక్టోబర్ 19 నుండి ఆస్ట్రేలియా జట్టుతో భారత జట్టు మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా 2027 వరల్డ్ కప్‌కు సంబంధించిన చర్చలు మరింత పెరిగే అవకాశం ఉంది.