Novak Djokovic: వింబుల్డన్ ఫైనల్‌లో అడుగుపెట్టిన నొవాక్ జకోవిచ్
Novak Djokovic: గ్రాండ్‌స్లామ్ సెమీస్‌లో సీడ్ సిన్నర్‌ను చిత్తుచేసిన జకోవిచ్
Novak Djokovic: వింబుల్డన్ ఫైనల్‌లో అడుగుపెట్టిన నొవాక్ జకోవిచ్
Novak Djokovic: వింబుల్డన్‌లో ఎనిమిదో టైటిల్‌పై గురిపెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌లో 6-3, 6-4, 7-6 తేడాతో ఎనిమిదో సీడ్ సిన్నర్‌ను చిత్తుచేశాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ సెమీస్ ఆడిన 21 ఏళ్ల సిన్నర్.. జకోవిచ్ దూకుడు ముందు తేలిపోయాడు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కూడిన ఫోర్‌హ్యాండ్ విన్నర్లతో సిన్నర్ సవాలు విసిరినా.. జకో దీటుగా ఎదుర్కొన్నాడు. తొలి సెట్ రెండో గేమ్‌లో సర్వీస్ బ్రేక్ చేసిన జకో చూస్తుండగానే 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అక్కడి నుంచి తన సర్వీస్‌లు నిలబెట్టుకున్న సిన్నర్ పోటీనిచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఏస్‌లతో సత్తాచాటిన జకో కూడా సర్వీస్‌లు కోల్పోకుండా పట్టునిలుపుకున్నాడు.
అదే ఊపులో క్రాస్ కోర్ట్ ఫోర్‌హ్యాండ్‌లతో జకో సాగిపోయాడు. రెండో సెట్ మూడో గేమ్‌లో బ్రేక్ సాధించిన జకో.. ఆపై 3-1తో విజృంభించాడు. మూడో సెట్ హోరాహోరీగా సాగింది. ప్లేయర్స్ ఇద్దరూ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు సమమవుతూ సాగింది. సర్వీస్ బ్రేక్ చేసే అవకాశాన్ని ఇవ్వని సిన్నర్.. సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించాడు. ఇందులోనూ పోటాపోటీగా తలపడ్డారు. చివరకు అనుభవాన్ని ఉపయోగించి జకో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలోనే అత్యధికంగా 35 సార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరిన తొలి ఆటగాడిగా జకోవిచ్ రికార్డు సృష్టించాడు. జకోవిచ్ ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్‌ను గెల్చుకున్నాడు.