Ind Vs Pak : గ్రౌండ్‌లోనే కుల్దీప్ యాదవ్‌కు క్లాస్ పీకిన హార్దిక్.. కళ్ళెర్రజేసిన కెప్టెన్ సూర్య.. వీడియో వైరల్

గ్రౌండ్‌లోనే కుల్దీప్ యాదవ్‌కు క్లాస్ పీకిన హార్దిక్.. కళ్ళెర్రజేసిన కెప్టెన్ సూర్య.. వీడియో వైరల్

Update: 2026-02-16 02:47 GMT

Ind Vs Pak : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దాయాదిపై రికార్డు స్థాయి విజయం నమోదు కావడంతో మైదానంలో ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ గెలుపు ఉత్సాహంలో ఒక వింత దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. జట్టు విజయం సాధించినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇద్దరూ కలిసి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య కళ్ళెర్రజేసి చూడగా, హార్దిక్ అందరి ముందే కుల్దీప్‌ను మందలించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇంత పెద్ద గెలుపు తర్వాత కూడా కుల్దీప్‌పై వీరు ఎందుకు విరుచుకుపడ్డారు? ఆ మైదానంలో అసలేం జరిగింది? అనే ఆసక్తికర వివరాలు చూద్దాం.

పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ హైడ్రామా చోటుచేసుకుంది. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్ రెండో బంతికి పాక్ ఆటగాడు షాహీన్ షా అఫ్రిది భారీ షాట్ ఆడాడు. బంతి గాలిలోకి లేవడంతో లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ ఆ క్యాచ్‌ను సులభంగా అందుకుంటాడని అందరూ భావించారు. కానీ కుల్దీప్ అంచనా తప్పి ఆ క్యాచ్‌ను జారవిడచడమే కాకుండా, అది కాస్తా బౌండరీ అవతలికి వెళ్లి సిక్సర్‌గా మారింది. అవుట్ కావాల్సిన బంతికి సిక్స్ రావడంతో బౌలింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా ముఖం మాడిపోయింది. హార్దిక్ అప్పటికప్పుడు ఏమీ అనకపోయినా, తన మనసులో ఉన్న కోపాన్ని మాత్రం దాచుకోలేకపోయాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో కుల్దీప్ యాదవ్ దగ్గరకు రాగానే హార్దిక్ పాండ్యా తన భడాస్ బయటపెట్టాడు. ఆ క్యాచ్ ఎలా మిస్ చేస్తావంటూ గ్రౌండ్‌లోనే గట్టిగా క్లాస్ పీకాడు. అంతటితో ఆగకుండా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా కుల్దీప్ వైపు కోపంగా చూస్తూ, కళ్ళతోనే హెచ్చరించాడు. ఎంత పెద్ద విజయం సాధించినా ఫీల్డింగ్‌లో ఇలాంటి తప్పులు చేయడం క్షమించరానిదని ఈ సీనియర్ ఆటగాళ్లు భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ లాంటి జట్టుతో ఆడుతున్నప్పుడు ప్రతి పరుగు, ప్రతి వికెట్ ఎంతో కీలకమని వారు కుల్దీప్‌కు అర్థమయ్యేలా చెప్పారు.

కుల్దీప్ యాదవ్ ఫీల్డింగ్‌లో తప్పు చేసినా, తన ప్రధాన ఆయుధమైన బౌలింగ్‌లో మాత్రం పాకిస్థాన్‌ను బురిడీ కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన కుల్దీప్ కేవలం 14 పరుగులు ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టాడు. ఒక విశేషమేమిటంటే, కుల్దీప్ యాదవ్ పాకిస్థాన్‌పై ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్ తీస్తూ తన రికార్డును పదిలపరుచుకున్నాడు. ఇప్పటి వరకు వన్డేలు, టీ20లు కలిపి పాక్‌పై 9 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్.. ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకసారి 5 వికెట్లు, మరోసారి 4 వికెట్లు తీసిన ఘనత కూడా ఉంది. బౌలింగ్‌లో అంత మంచి రికార్డు ఉన్నా, ఆ ఒక్క క్యాచ్ డ్రాప్ వల్ల సీనియర్ల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. "గెలిచాం కదా అని వదిలేయకుండా, క్రమశిక్షణ విషయంలో సూర్య, హార్దిక్ ఇంత కఠినంగా ఉండటం మంచిదే" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచేందుకే కుల్దీప్‌ను అలా మందలించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, గెలుపు సంబరాల్లోనూ టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ తప్పులను సమీక్షించుకోవడం చూస్తుంటే, ఈసారి వరల్డ్ కప్ కొట్టాలనే పట్టుదల వారిలో ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది.

Tags:    

Similar News