Nitish Kumar Reddy: సెంచరీ చేస్తానని చెప్పాడు.. చేసి చూపాడు.. పేరేంట్స్ భావోద్వేగం
అస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సెంచరీ సాధించడంపై కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
సెంచరీ చేస్తానని చెప్పాడు.. చేసి చూపాడు: నితీశ్ రెడ్డి పేరేంట్స్ భావోద్వేగం
అస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సెంచరీ సాధించడంపై కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. బాక్సింగ్ డే టెస్టులో నితీశ్ 176 బంతుల్లో 105 పరుగులు చేశారు. నితీశ్ సెంచరీ చేయడంతో కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు. అన్నది సాధించారని నితీశ్ సోదరి చెప్పారు.
నితిశ్ కుమార్ రెడ్డి కుటుంబం విశాఖపట్టణంలో నివాసం ఉంటుంది. ఆయన తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్థాన్ జింక్ లో ఉద్యోగం చేసేవారు. నితీశ్ ఐదేళ్ల కాలం నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో నితీశ్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నారు. ముత్యాలరెడ్డికి ఉదయ్ పూర్ కు బదిలీ అయింది. కొడుకు కోసం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయనకు ఇంకా 25 ఏళ్ల సర్వీస్ ఉంది. నితీష్ ను వెన్నంటే ఉన్నారు.
2019-20 రంజీ సీజన్ తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి నితీశ్ కుమార్ రెడ్డి అడుగు పెట్టారు. దేశవాళీ క్రికెట్ లో ఆయన నిలకడగా రాణిస్తున్నారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నితీశ్ ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఆయన రాణించారు. ఈ ప్రదర్శనే ఆయనకు అంతర్జాతీయ టీ 20 ల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కారణమైంది.
అస్ట్రేలియా సిరీస్ లో నితీశ్ ను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలకు తన ఆటతోనే నితీశ్ సమాధానం చెప్పారు. పెర్త్ టెస్టులో 41, 38 పరుగులు చేశారు. ఒక వికెట్ కూడా తీశారు. ఆడిలైడ్ టెస్టులో 42, 42 పరుగులతో పాటు వికెట్ కూడా ఆయనకు దక్కింది. నాలుగో టెస్టులో సెంచరీ చేశారు.