IND vs PAK T20 World Cup 2026: మైదానంలోనే ప్రతీకారం తీర్చుకుంటాం.. భారత్‌కు పాక్ బౌలర్ వార్నింగ్! టీ20 వరల్డ్ కప్‌కు ముందే ముదిరిన వివాదం..

టీ20 ప్రపంచకప్ 2026 కు ముందు భారత్-పాక్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. సరిహద్దు ప్రతీకారం మైదానంలో తీర్చుకుంటామన్న షాహీన్ అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ..

Update: 2026-01-09 09:22 GMT

భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం ఎప్పుడూ ఆటలా ఉండదు.. అది ఒక భావోద్వేగ యుద్ధం. 2026 టీ20 ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో, పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో మంటలు పుట్టిస్తున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మైదానంలోకి చేరడంతో ఇరు దేశాల అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది.

ఆసియా కప్ వివాదం.. అసలేం జరిగింది?

ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, విజయం కంటే మైదానం బయట జరిగిన సంఘటనే హాట్ టాపిక్‌గా మారింది.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితుల వల్ల, భారత ఆటగాళ్లు పాక్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి.

మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం గమనార్హం.

షాహీన్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు:

తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో షాహీన్ అఫ్రిది మాట్లాడుతూ భారత్ వైఖరిపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. "సరిహద్దు అవతల ఉన్న కొందరు వ్యక్తులు క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించారు. మా పని క్రికెట్ ఆడటం.. మా ప్రతీకారం ఏంటో మైదానంలోనే చూపిస్తాం" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీనితో టీ20 వరల్డ్ కప్‌లో జరగబోయే భారత్-పాక్ మ్యాచ్‌పై అప్పుడే హైప్ క్రియేట్ అయింది.

భారత అభిమానుల స్ట్రాంగ్ కౌంటర్:

షాహీన్ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

"ముందు నీ ఫిట్‌నెస్ చూసుకో.. తర్వాత ప్రతీకారం గురించి మాట్లాడు" అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

"ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయి.. మైదానంలో సూర్య కుమార్ యాదవ్ నిన్ను ఎలా ఊచకోత కోస్తాడో చూద్దువు గానీ" అని సవాళ్లు విసురుతున్నారు.

గాయంతో సతమతమవుతున్న షాహీన్:

ప్రస్తుతం షాహీన్ అఫ్రిది మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ ఆడుతుండగా ఆయనకు గాయమైంది. ప్రస్తుతం లాహోర్‌లో పునరావాసం పొందుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ నాటికి అతను కోలుకుంటాడా లేదా అనేది పాక్ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. పాక్ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా షాహీన్ లభ్యతపై ఆందోళన వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News