India-Umpire: ఆయన మైదానంలో ఉన్నాడంటే.. భారత్ ఓటమి పక్కా!
India-Umpire: స్వదేశంలో టీ20 వరల్డ్‌కప్ 2026 జరుగుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది.
India-Umpire: ఆయన మైదానంలో ఉన్నాడంటే.. భారత్ ఓటమి పక్కా!
India-Umpire: స్వదేశంలో టీ20 వరల్డ్‌కప్ 2026 జరుగుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓటములకు ఒక కామన్ లింక్ ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ లింక్ మరెవరో కాదు.. ఇంగ్లాండ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లోని ప్రముఖ అంపైర్ కెటిల్‌బరో అన్న విషయం తెలిసిందే. అయితే గణాంకాలను పరిశీలిస్తే.. కొన్ని కీలక మ్యాచ్‌ల్లో కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్న సందర్భాల్లో భారత్ ఓడిపోయింది.
2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడింది. 2015 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదురైంది. 2016 టీ20 వరల్డ్‌కప్ సెమీలో వెస్టిండీస్ విజయం సాధించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాపై పాకిస్తాన్ గెలిచింది. 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీలో న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ రన్‌ఔట్ ఘటన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో మళ్లీ ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది.
ఈ మ్యాచ్‌లు అన్నింటిలోనూ మైదానంలో అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరో ఉండటం యాదృచ్ఛికమే అయినప్పటికీ.. అభిమానులు దీనిని 'కెటిల్‌బరో కర్స్'గా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు అభిమానులు ఐసీసీని ట్యాగ్ చేస్తూ.. భవిష్యత్ భారత మ్యాచ్‌లకు కెటిల్‌బరోను ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా నియమించవద్దని కూడా కోరుతున్నారు. 'ఐరెన్ లెగ్ అంపైర్', 'అయ్యగారు ఉంటే మ్యాచ్ పోయినట్లే', 'టీమిండియా బ్యాడ్ లాక్ అంపైర్' అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని అంటున్నారు. మ్యాచ్ ఫలితాలు ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడతాయి కానీ.. అంపైర్‌పై కాదు అని అంటున్నారు. అయినప్పటికీ అభిమానుల భావోద్వేగాల్లో మాత్రం ఈ 'కర్స్' కథనం బలంగా వినిపిస్తోంది. రాబోయే కీలక మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధిస్తే.. ఈ ప్రచారంకు తెరపడుతుందో చూడాలి. ఇక దక్షిణాఫ్రికాపై ఓటమితో భారత్ సెమీస్ ఆశలు సన్నగిల్లిన విషయం తెలిసిందే.