IND vs WI Super 8: టెన్షన్ పెడుతున్న సమీకరణాలు.. అదే జరిగితే టీ20 వరల్డ్‌కప్‌ నుంచి భారత్ అవుట్!

IND vs WI Super 8: సూపర్ 8లో నెట్ రన్‌రేట్ కీలకం.. విండీస్ మ్యాచ్ ఫలితమే భారత్ భవితవ్యాన్ని నిర్ణయించనుందా?

Update: 2026-02-28 08:36 GMT

IND vs WI Super 8: టెన్షన్ పెడుతున్న సమీకరణాలు.. అదే జరిగితే టీ20 వరల్డ్‌కప్‌ నుంచి భారత్ అవుట్!

టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్ రేస్ ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది. గ్రూప్-1 నుంచి ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించగా.. పసికూన జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ మధ్య పోటీ హోరాహోరీగా మారింది. ఆదివారం (మార్చి 1) కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరగనున్న మ్యాచ్ ఈ రెండు జట్ల భవిష్యత్తును నిర్ణయించనుంది. గెలిచిన టీమ్ సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన టీమ్ మాత్రం ఇంటిదారి పడుతుంది. అయితే నెట్ రన్‌రేట్ సమీకరణాలు టీమిండియాను టెన్షన్ పెడుతున్నాయి.

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య సూపర్-8 మ్యాచ్ ముందు వరకు భారత్ సెమీస్ అవకాశాలు చాలా తక్కువ. కానీ ఒక్క రోజులో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫిబ్రవరి 26న వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించడం, అలాగే జింబాబ్వేపై భారత్ భారీ విజయం నమోదు చేయడంతో సెమీఫైనల్ రేసులో టీమిండియా మళ్లీ నిలబడింది. ఇక వెస్టిండీస్‌తో మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ప్రస్తుతం రెండు టీమ్స్ రెండేసి మ్యాచులు ఆడి.. రెండు పాయింట్లతో ఉన్నాయి. అయితే విండీస్ నెట్ రన్‌రేట్ +1.791 ఉండగా.. భారత్ నెట్ రన్‌రేట్ -0.100గా ఉంది. ఇదే ఇప్పుడు టీమిండియాకు ఇబ్బందిగా మారింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. భారత్, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు రెండు జట్ల ఖాతాలో మూడేసి పాయింట్స్ ఉంటాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న విండీస్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. మైనస్ రన్‌రేట్ ఉన్న సూర్య సేన ఇంటికి పయనం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రేపు కోల్‌కతాలో వర్షం పడొద్దని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు భారత్ సెమీస్ ఆశలు వరుణ దేవుడిపై ఆధారపడి ఉన్నాయి.

భారత్ రన్‌రేట్ తక్కువగా ఉండడానికి కారణం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. జింబాబ్వే మ్యాచ్‌లో ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు బదులుగా ఆల్‌రౌండర్‌ శివమ్ దూబేకు రెండు ఓవర్లు బౌలింగ్ ఇచ్చాడు. ఆ రెండు ఓవర్లలో ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. దూబే మొదటి ఓవర్లో నిరాశపర్చినా.. మరో అవకాశం సూర్య ఇచ్చాడు. దాంతో ఇన్నింగ్స్ చివరలో జింబాబ్వే భారీ రన్స్ చేసింది. జింబాబ్వే మ్యాచ్‌లో 108 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలిచుంటే.. భారత్ నెట్ రన్‌రేట్ వెస్టిండీస్ కంటే మెరుగ్గా ఉండేది. అప్పుడు వర్షం పడినా మనకే అవకాశాలు ఉండేవి. ఇపుడు సూర్యపై ఫాన్స్ గుర్రుగా ఉన్నారు.

Tags:    

Similar News