Asia Cup 2025: చివరి బంతి వరకు ఉత్కంఠ.. ఆసియా కప్ 2025 లో టీమిండియాకు మరో విజయం

Asia Cup 2025: ఆసియా కప్‌లో టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. సూపర్-4 దశలో చివరి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరు సూపర్ ఓవర్‌కు దారితీసింది.

Update: 2025-09-27 05:00 GMT

Asia Cup 2025: చివరి బంతి వరకు ఉత్కంఠ.. ఆసియా కప్ 2025 లో టీమిండియాకు మరో విజయం  

Asia Cup 2025: ఆసియా కప్‌లో టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. సూపర్-4 దశలో చివరి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరు సూపర్ ఓవర్‌కు దారితీసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 202 పరుగులు చేయగా, శ్రీలంక కూడా సరిగ్గా 202 పరుగులే చేసింది. అయితే, ఉత్కంఠగా జరిగిన సూపర్ ఓవర్‌లో శ్రీలంకపై భారత్ విజయం సాధించి, టోర్నీలో లగాయిత్తుగా ఆరో విజయాన్ని నమోదు చేసింది.

సూపర్-4లో భారత్, శ్రీలంకల మధ్య జరిగిన చివరి మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తింది. 202 పరుగుల భారీ స్కోర్‌ను రెండు జట్లూ సరిగ్గా సమం చేయడంతో, మ్యాచ్ టై అయ్యి, ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. శ్రీలంక ఓపెనర్ పాథుమ్ నిస్సంక అద్భుతమైన సెంచరీ (107 పరుగులు) సాధించినప్పటికీ, చివరికి విజయం భారత్‌నే వరించింది. ఈ విజయంతో టీమిండియా ఫైనల్‌కు అజేయ శక్తిగా అడుగుపెట్టింది.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టు జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే వంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. దీంతో బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా బాధ్యత వహించారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ మరోసారి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతను కేవలం 22 బంతుల్లో 61 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం సంజు శాంసన్ 39 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

యంగ్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ 34 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసి, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. వీరి సమిష్టి కృషితో భారత్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల బలమైన స్కోరును నమోదు చేయగలిగింది. శ్రీలంక తరఫున ఆరుగురు బౌలింగ్ చేయగా, చరిత్ అసలంక, దసున్ శనక, వనిందు హసరంగా, దుష్మంత చమీరా, మహీష్ తీక్షణ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.

203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక కేవలం 7 పరుగులకే కుశాల్ మెండిస్ వికెట్‌ను కోల్పోయింది. మెండిస్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్ పెరీరా, పాథుమ్ నిస్సంక రెండో వికెట్‌కు 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పెరీరా 32 బంతుల్లో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఎండ్‌లో నిస్సంక ఒంటరి పోరాటం చేస్తూ కేవలం 52 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేశాడు. అతను చివరి ఓవర్ వరకు పోరాడి 58 బంతుల్లో 107 పరుగులు చేసి ఔటయ్యాడు.

శ్రీలంకకు చివరి ఓవర్‌లో గెలవడానికి 12 పరుగులు అవసరం కాగా, ఆ జట్టు 11 పరుగులే చేయగలిగింది. దీంతో స్కోర్లు సమమై, మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టుకు భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ షాక్ ఇచ్చాడు. శ్రీలంక తరఫున కుశాల్ పెరీరా, దసున్ శనక బ్యాటింగ్‌కు వచ్చారు. అర్ష్‌దీప్ మొదటి బంతికే పెరీరాను ఔట్ చేశాడు. ఐదో బంతికి శ్రీలంక రెండో వికెట్‌ను కోల్పోయింది. కేవలం 5 బంతులు మాత్రమే ఆడి శ్రీలంక 2 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత జట్టుకు విజయానికి కేవలం 3 పరుగుల లక్ష్యం మాత్రమే నిర్దేశించబడింది. భారత్ తరఫున కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు వచ్చారు. శ్రీలంక తరఫున వనిందు హసరంగా బౌలింగ్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ హసరంగా వేసిన మొదటి బంతిపైనే మూడు పరుగులు సాధించి, టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ టోర్నీలో లగాయిత్తుగా ఆరో గెలుపు నమోదు చేసింది.

Tags:    

Similar News