Rohit Sharma: రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్ ఎటాక్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. అతను కెప్టెన్సీకి పనికిరాడు అంటూ కించపరిచేలా కామెంట్స్ చేశారు.
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్ ఎటాక్
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. అతను కెప్టెన్సీకి పనికిరాడు అంటూ కించపరిచేలా కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై పెద్ద దుమారమే తలెత్తింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ ట్రోఫీలో టీమిండియా అద్భుతంగా రాణిస్తున్నా కెప్టెన్ రోహిత్ శర్మ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశారు. ఈ క్రమంలో రోహిత్ పై కాంగ్రెస్ నాయకురాలు షామా మహహ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా రోహిత్‌ను టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్‌గా లేడు. అతను బరువు తగ్గాలి. అంతేకాదు.. గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి అతడే అని రాసుకొచ్చారు. ఈ పోస్టు కాస్త నెట్టింట వైరల్ కావడంతో దీనిపై తీవ్ర దుమారం రాజుకుంది.
షామా వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందించారు. భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి భారతీయుడికి ఇది అవమానమన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుందని విమర్శించారు. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా..? అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు నెటిజన్లు సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి స్పందించిన షామా ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు.
షామా మహమ్మద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. షామా వ్యాఖ్యలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవు. ఆ పోస్టును సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఆమెను ఆదేశించాం. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాం. దేశ క్రీడాకారులను మా పార్టీ అత్యున్నతంగా గౌరవిస్తుంది. వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఎలాంటి ప్రకటనలను మేం ఆమోదించబోమని పార్టీ సీనియర్ నేత పవన్ ఖేడా ఎక్స్‌లో రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ తర్వాత 2020 నుంచి రోహిత్ శర్మ భారత్ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. రోహిత్ నాయకత్వంలో గత ఏడాది భారత జట్టు టీ20 ప్రపంచ కప్ సాధించింది. ఐపీఎల్‌లో కూడా రోహిత్ సారథ్యంలోనే ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. క్రికెట్ చరిత్రలో రోహిత్‌కు పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే.