Yusaf Pathan: ఆ పదం వినడానికి బాధగానే ఉంది: యూసఫ్ పఠాన్

Yusaf Pathan: టీం ఇండియా ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ తో సహా అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Update: 2021-02-26 12:48 GMT

యూసఫ్ పఠాన్ (ఫోటో ట్విట్టర్ )

Yusaf Pathan: టీం ఇండియా వెటరన్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ (38 ఏళ్లు) ఇంటర్నేషనల్ క్రికెట్ తో సహా అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వార భావోద్వేగపు పోస్ట్ షేర్ చేశాడు. "రిటైర్మెంట్‌ అనే పదం వినడానికి బాధగా ఉంది. ప్రతీ ఒక్కరు ఏదో ఒక దశలో తమ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల్సిందే. నా రిటైర్మెంట్‌కు ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నా. నేటితో ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నా" నని అన్నాడు. అలాగే టీమిండియా తరపున ఆడడం గౌరవంగా భావిస్తున్నా. సచిన్ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, గౌతమ్‌ గంభీర్‌, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ లాంటి ఆటగాళ్లతో ఆడడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా అని పేర్కొన్నాడు. ఇన్ని రోజులు అందించిన మద్దతుకు నా ధన్యవాదాలంటూ ముగించాడు.

కాగా ఇర్పాన్ పఠాన్‌ బ్రదర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బరోడా ఆల్‌రౌండర్‌ 2007లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున 57 వన్డేల్లో 810 పరుగులు చేశాడు. 22 టీట్వంటీల్లో 232 పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు.. 5 అర్థ సెంచరీలు చేశాడు. పవర్‌ హిట్టర్‌గా పేరు పొందిన అతడు.. 2012 తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు.

యూసఫ్‌ కెరీర్‌లో కొన్ని గుర్తుంచుకునే ఇన్నింగ్స్‌ ఉన్నాయి. 2010లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచి ఆకట్టుకున్నాడు యూసఫ్‌. 4వ వన్డేలో 129 పరుగుల నాటౌట్‌ ఇన్నింగ్స్‌తో పాటు బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. 2011 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 70 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. దీంతో ఆల్‌రౌండర్‌ గా 2011 ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాధించాడు. టీమిండియా సాధించిన 2007 టీ20, 2011 ప్రపంచకప్‌లో భాగస్వామ్యం కావడం యూసఫ్ కెరీర్‌లో మరిచిపోలేనివిగా ఉండిపోతాయనడంలో సందేహం లేదు.

అయితే వరల్డ్ కప్ తర్వాత పఠాన్‌ కెరీర్‌ పడిపోయింది. దీంతో సెలెక్టర్లు కూడా అతని పేరు పరిగణలోకి తీసుకోకపోవడంతో క్రమంగా జట్టు నుంచి దూరమయ్యాడు. అలా యూసఫ్ కెరీర్‌ టీమిండియాలో కనుమరుగైంది. ఇక 2008 ఐపీఎల్‌ లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ఆడి టైటిల్‌ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆ తర్వాత సీజన్లలో యూసఫ్‌ పఠాన్‌ కేకేఆర్‌, పుణే వారియర్స్‌, సన్‌రైజర్స్‌ తరపున ఆడాడు. 2018లో చివరిసారి ఐపీఎల్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత సీజన్‌కు సెలక్టర్లు తీసుకోక పోవడంతో ఇక ఐపీఎల్ లోనూ అడుగుపెట్టలేదు. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌కు వచ్చిన అతను పఠాన్‌ క్రికెట్‌ అకాడమీని ప్రారంభించాడు.


Tags:    

Similar News