IND vs PAK : క్రికెట్ ఫ్యాన్స్‌కు పూనకాలే..ఫిబ్రవరి 15న భారత్..పాకిస్థాన్ మెగా ఫైట్ ఫిక్స్

క్రికెట్ ఫ్యాన్స్‌కు పూనకాలే..ఫిబ్రవరి 15న భారత్..పాకిస్థాన్ మెగా ఫైట్ ఫిక్స్

Update: 2026-02-10 01:23 GMT

IND vs PAK : క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద సమరానికి తెరలేచింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అది కేవలం ఆట కాదు, కోట్లాది మంది అభిమానుల ఎమోషన్. కొద్ది రోజులుగా ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదట ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని భీష్మించుకు కూర్చున్న పాక్, ఐసీసీ దెబ్బకు దారిలోకి వచ్చింది. టి20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ జరగాలి. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పీసీబీ ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడమే దీనికి ప్రధాన కారణమని పాక్ సాకులు చెప్పింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రతినిధులు ఇమ్రాన్ ఖ్వాజా, ముబాషిర్ ఉస్మానీ లాహోర్ చేరుకుని పాక్ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే భారీ ఫైనాన్షియల్ పెనాల్టీలతో పాటు, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించడంతో పాక్ దిగివచ్చింది.

పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన

సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. "అనేక చర్చల తర్వాత, మిత్రదేశాల విన్నపాన్ని మన్నిస్తూ.. స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌ను గౌరవిస్తూ ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు మా జాతీయ జట్టును అనుమతిస్తున్నాం" అని పేర్కొంది. ఈ చర్చల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డులు కూడా కీలక పాత్ర పోషించాయి. పాకిస్థాన్ పెట్టిన కొన్ని డిమాండ్లను ఐసీసీ తిరస్కరించినప్పటికీ, టోర్నీ ప్రయోజనాల దృష్ట్యా పాక్ ఆడేందుకు మొగ్గు చూపింది.

కొలంబోలో సందడి షురూ

భారత్-పాక్ మ్యాచ్ కన్ఫర్మ్ కావడంతో కొలంబోలో పర్యాటక రంగం ఒక్కసారిగా పుంజుకుంది. ఫిబ్రవరి 15న జరగబోయే ఈ మ్యాచ్ కోసం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. స్టేడియం చుట్టుపక్కల హోటల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు 600 రోజుల తర్వాత భారత్-పాక్ మధ్య టి20 పోరు జరగనుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ తన స్పిన్ మ్యాజిక్‌తో పాక్‌ను ఎలా అడ్డుకుంటుందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రపంచ కప్‌లో భారత్ ఆధిపత్యం

ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. గత ఏడాది అమెరికాలో జరిగిన వరల్డ్ కప్‌లో కూడా భారత్ పాక్‌ను మట్టికరిపించింది. ఇప్పుడు మళ్ళీ అదే జోరును కొనసాగించాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు, పాక్ జట్టులో అంతర్గత గొడవలు, ఫామ్ లేమి వేధిస్తున్నప్పటికీ.. భారత్‌తో మ్యాచ్ అనగానే వారు రెట్టింపు ఉత్సాహంతో ఆడతారు. అందుకే ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం.

Tags:    

Similar News