Ind Vs Pak : భారత్-పాక్ మ్యాచ్‌పై బీసీసీఐ సంచలన ప్రకటన.. ఐసీసీ ఏం చెబితే అదే చేస్తాం
భారత్-పాక్ మ్యాచ్‌పై బీసీసీఐ సంచలన ప్రకటన.. ఐసీసీ ఏం చెబితే అదే చేస్తాం
Ind Vs Pak : టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలైన మజా ఇచ్చే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా? క్రికెట్ అభిమానులందరినీ వేధిస్తున్న ఈ ప్రశ్నపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎట్టకేలకు స్పందించింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ పోరుపై పాకిస్థాన్ సృష్టించిన సస్పెన్స్‌కు తెరదించేలా బీసీసీఐ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ వివాదంపై ఇండియా వైఖరి ఏంటో కుండబద్దలు కొట్టింది.టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఢిల్లీలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన నివాసంలో ఆటగాళ్లకు అదిరిపోయే డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ భారత్-పాక్ మ్యాచ్‌పై క్లారిటీ ఇచ్చారు. "ఈ టోర్నమెంట్ నిర్వహిస్తోంది ఐసీసీ. కాబట్టి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. మేమే సొంతంగా ఎటువంటి నిర్ణయం తీసుకోము" అని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులో ఉందని అర్థమవుతోంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న రచ్చలో నేరుగా తలదూర్చడానికి బీసీసీఐ సిద్ధంగా లేదు. బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నీలో ఆడకపోవడానికి మద్దతుగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ మొదట చెప్పింది. అయితే ఇలాంటి రాజకీయ అంశాలను క్రికెట్‌లోకి లాగడం బీసీసీఐకి ఇష్టం లేదు. భారత బోర్డు కేవలం ఆటపైనే దృష్టి సారించింది. పాకిస్థాన్ ఒకవేళ ఆడకపోతే వచ్చే పాయింట్లు, ఇతర పరిణామాలను ఐసీసీనే చూసుకుంటుందని, ఇండియా మాత్రం షెడ్యూల్ ప్రకారం సిద్ధంగా ఉంటుందని రాజీవ్ శుక్లా మాటల సారాంశం.
మరోవైపు నమీబియాతో ఫిబ్రవరి 12న జరగబోయే మ్యాచ్ కోసం టీమిండియా ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కోచ్ గౌతమ్ గంభీర్ తన ఇంట్లో ఆటగాళ్లకు విందు ఇచ్చారు. కేవలం క్రికెట్ చర్చలే కాకుండా, ఆటగాళ్లందరూ సరదాగా సమయం గడిపారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ప్రస్తుతం చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. యూఎస్ఏపై గెలుపు తర్వాత టీమిండియా జోరు మీదుంది. దాయాది దేశం పాకిస్థాన్ మ్యాచ్ గురించి బుర్ర పాడు చేసుకోకుండా, ప్రస్తుత మ్యాచ్‌లపైనే గంభీర్ అండ్ కో దృష్టి పెట్టారు.
ఐసీసీ ప్రతినిధులు ఇప్పటికే లాహోర్‌కు వెళ్లి పాక్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒకవేళ పాకిస్థాన్ బలమైన కారణం లేకుండా మ్యాచ్‌కు దూరమైతే, భారీ జరిమానాతో పాటు టోర్నీ నుంచే బహిష్కరించే ముప్పు ఉంది. ఈ హెచ్చరికలతో పాక్ వైఖరిలో కొంత మెత్తదనం వచ్చినట్లు సమాచారం. అయితే అధికారికంగా పాక్ ఇప్పటికీ బంగ్లాదేశ్ ప్రయోజనాల ముసుగులోనే కాలక్షేపం చేస్తోంది. ఏది ఏమైనా, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఎదురుచూస్తున్న ఫిబ్రవరి 15 మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది మరో రెండు రోజుల్లో ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.