T20 World Cup 2026: ముగిసిన చర్చలు.. పాక్‌కు అల్టిమేటం జారీ చేసిన ఐసీసీ! 15న భారత్-పాక్ పోరుపై వీడని ఉత్కంఠ

T20 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత భారీ క్రేజ్ ఉన్న భారత్-పాకిస్థాన్ (IND vs PAK) పోరుపై సందిగ్ధత కొనసాగుతోంది.

Update: 2026-02-09 05:40 GMT

T20 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత భారీ క్రేజ్ ఉన్న భారత్-పాకిస్థాన్ (IND vs PAK) పోరుపై సందిగ్ధత కొనసాగుతోంది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మొండివైఖరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై తేల్చుకోవడానికి పాక్‌కు ఐసీసీ 24 గంటల డెడ్‌లైన్ విధించడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది.

ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చలు.. పీసీబీ మూడు డిమాండ్లు!

ఆదివారం లాహోర్‌లో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీతో ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు సమావేశమయ్యారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో పీసీబీ ఐసీసీ ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచినట్లు సమాచారం:

బంగ్లాదేశ్‌లో క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ నుంచి అదనపు నిధులు కేటాయించాలి.

టోర్నీలో పాల్గొనకపోయినా బంగ్లాదేశ్‌కు 'పార్టిసిపేషన్ ఫీజు' చెల్లించాలి.

భవిష్యత్తులో ఐసీసీ మెగా ఈవెంట్ల ఆతిథ్య హక్కులను బంగ్లాదేశ్‌కు కల్పించాలి.

భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడటానికి నిరాకరించిన బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇవ్వగా, బంగ్లాకు మద్దతుగా పాక్ ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రధాని చేతుల్లో పాక్ నిర్ణయం?

ఐసీసీ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ సోమవారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ కానున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే పాక్ ఈ మ్యాచ్ ఆడుతుందా లేదా అనేది తేలనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న కొలంబో వేదికగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉంది.

ఐసీసీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం: బీసీసీఐ

మరోవైపు ఈ వివాదంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టత ఇచ్చారు. ఈ విషయంలో తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, అంతిమంగా ఐసీసీ తీసుకునే నిర్ణయానికి భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బంతి ఇప్పుడు పాకిస్థాన్ కోర్టులోనే ఉండటంతో, క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News