Gerhard Erasmus: మాపై కాదు, భారత్‌పైనే ఒత్తిడి.. నమీబియా కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

భారత క్రికెట్ జట్టుతో మ్యాచ్ అంటే ప్రపంచంలోని ఏ జట్టుకైనా భారీ ఒత్తిడి తప్పదు. ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్టుగా ఉన్న భారత్‌ను ఎదుర్కోవడం టాప్ జట్లకు కూడా సవాలే.

Update: 2026-02-09 11:57 GMT

Gerhard Erasmus: మాపై కాదు, భారత్‌పైనే ఒత్తిడి.. నమీబియా కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

భారత క్రికెట్ జట్టుతో మ్యాచ్ అంటే ప్రపంచంలోని ఏ జట్టుకైనా భారీ ఒత్తిడి తప్పదు. ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్టుగా ఉన్న భారత్‌ను ఎదుర్కోవడం టాప్ జట్లకు కూడా సవాలే. అయితే పసికూన నమీబియా టీమ్ కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ మాత్రం పూర్తి బిన్నంగా స్పందించాడు. టీమిండియాతో మ్యాచ్ అంటే తమకు ఎలాంటి భయం లేదని, ఒత్తిడి తమపై కాకుండా భారత్‌పైనే ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్‌ 2026లో టీమిండియా ఇప్పటికే బోణీ కొట్టింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఇక ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో సూర్య సేన తలపడనుంది.

ఓ ఇంటర్వ్యూలో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్‌ను భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కి సంబంధించి ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న అడిగాడు. 'భారత్‌తో మ్యాచ్‌లో మీపై ఎలాంటి ప్రెజర్ ఉంటుంది?' అని ప్రశ్నించగా… 'అవును, భారత్ చాలా పెద్ద జట్టు. టీమిండియా ఎంతో బలంగా ఉంది. అంతేకాదు డిఫెండింగ్ చాంపియన్ కూడా. అయినప్పటికీ మాపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. మేము హోం గ్రౌండ్‌లో ఆడుతున్నాం. అందుకే అసలు ఒత్తిడి మొత్తం భారత్‌పైనే ఉంటుంది. మేము స్వేచ్ఛగా ఆడతాం. భారత జట్టుకు ఒక్కఅవకాశం కూడా ఇవ్వం' అని గెర్హార్డ్ ఎరాస్మస్ చెప్పాడు. ఎరాస్మస్‌ సమాధానం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అతడి వ్యాఖ్యలు నమీబియా జట్టు ఎంత ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌ను ఎదుర్కొంటుందో స్పష్టంగా చూపిస్తున్నాయి.

'2022 ప్రపంచకప్‌లో మేము ఆసియా కప్ విజేత శ్రీలంకను ఓడించాము. టీ20 క్రికెట్‌లో చిన్న జట్లు అనే చర్చకు తావు లేదని, ప్రతిభ పరంగా తాము ఎవరికీ తక్కువ కాదని నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ పేర్కొన్నాడు. 'చిన్న జట్టుగా మనల్ని మనం ముద్రించుకోకూడదు. ఈ లేబుళ్లతో మమ్మల్ని పరిమితం చేయకండి. మేము కూడా మనుషులమే. మిగతా టీమ్స్ కూడా అదే తెల్ల బంతితో ఆడుతాయి. మేం నిరూపించుకోవడానికి మా దగ్గర ప్రతిభ ఉంది. భారత్‌తో ఆడుతున్నప్పుడు మేం కోల్పోయేది ఏమీ లేదు. కాబట్టి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తాము. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడతాము. భారత్‌పై అమెరికా ఎలా పోరాడిందో మనం చూశాము. మేము కూడా సవాలు విసురుతాం' అని నమ్మకంగా చెప్పాడు.

నమీబియా వరుసగా నాలుగోసారి టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం దేశంలో క్రికెట్ సరైన మార్గంలో ఉందనడానికి నిదర్శనం. గత అక్టోబర్‌లో నమీబియా తన పొరుగు దేశం దక్షిణాఫ్రికాను తొలిసారి ఓడించి చరిత్ర సృష్టించింది. భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, అమెరికాలతో గ్రూప్ ఎలో నమీబియా ఉంది. మంగళవారం ఢిల్లీలో జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఆపై ఇండియాతో ఆడనుంది.

Tags:    

Similar News