India vs Pakistan: పీసీబీ సంచలన నిర్ణయం.. భారత్‌లో 2031 వరకు ఆడేది లేదు?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలనం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2031 వరకు భారత్‌లో జరిగే ఏ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గ్లోబల్ ఈవెంట్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు పాల్గొనబోదని పీసీబీ స్పష్టం చేసినట్లు సమాచారం.

Update: 2026-02-09 11:23 GMT

India vs Pakistan: పీసీబీ సంచలన నిర్ణయం.. భారత్‌లో 2031 వరకు ఆడేది లేదు?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలనం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2031 వరకు భారత్‌లో జరిగే ఏ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గ్లోబల్ ఈవెంట్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు పాల్గొనబోదని పీసీబీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని నేరుగా ఐసీసీకి తెలియజేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారత్ జట్టు ముందుగా పాకిస్థాన్‌కు వచ్చి ఆడితే తప్ప.. తమ నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని పీసీబీ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 15న భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్ లేనట్టే.

ప్రస్తుతం భారత్–పాకిస్థాన్ మధ్య జరిగే ఐసీసీ టోర్నీలకు అమల్లో ఉన్న హైబ్రిడ్ మోడల్ గడువు 2028 వరకు మాత్రమే ఉంది. అయితే ఈ హైబ్రిడ్ మోడల్‌ను 2031 వరకు పొడిగించాలని పాకిస్థాన్ బోర్డు ఐసీసీని అధికారికంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. భద్రతా కారణాల పేరుతో భారత్‌లో ఆడలేమన్న వాదనను కొనసాగిస్తూనే.. తమ మ్యాచ్‌లను న్యూట్రల్ వేదికల్లో నిర్వహించాలన్నది పీసీబీ ప్రధాన షరతుగా పెట్టింది. ఈ మొత్తం పరిణామాల వెనుక పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక పాత్ర పోషిస్తున్నారని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన వైఖరి భారత్, బీసీసీఐ మాత్రమే కాకుండా ఐసీసీకి కూడా పెద్ద సవాలుగా మారింది.

'మా డిమాండ్స్ నెరవేరే వరకు పీసీబీ నిర్ణయం మారదు' అనే మొహ్సిన్ నక్వీ మాటలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంత కఠినంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ పభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ఎలాగైనా నిర్వహించాలని ఐసీసీ మొండి పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఆదివారం పీసీబీతో ఐసీసీ సంప్రదింపులు జరిపింది. మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. కఠిన చర్యలు కూడా తప్పవని హెచ్చరించింది. టీమిండియాతో మ్యాచ్ ఆడాలంటే.. మూడు డిమాండ్లను ఐసీసీ ముందుంచింది. ఆ డిమాండ్లకు బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.

పీసీబీ నిర్ణయం భవిష్యత్ ఐసీసీ టోర్నీల షెడ్యూలింగ్‌పై, అలాగే భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌లపై భారీ ప్రభావం చూపే అవకాశముంది. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లు మరింత సంక్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బంతి పూర్తిగా ఐసీసీ కోర్టులో ఉంది. ఈ వివాదానికి ఐసీసీ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూడాలి.

Tags:    

Similar News