Sankranti 2026: గంగిరెద్దులు, హరిదాసుల సందడి సంక్రాంతికే ఎందుకు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఇదే!
Sankranti 2026: సంక్రాంతి పండుగ అంటేనే గంగిరెద్దులు, హరిదాసుల సందడి గుర్తుకు వస్తుంది.
Sankranti 2026: గంగిరెద్దులు, హరిదాసుల సందడి సంక్రాంతికే ఎందుకు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఇదే!
Sankranti 2026: సంక్రాంతి పండుగ అంటేనే గంగిరెద్దులు, హరిదాసుల సందడి గుర్తుకు వస్తుంది. “అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు” అంటూ ఇంటి ముందుకు వచ్చే బసవన్నను చూసేందుకు చిన్నారులకే కాదు పెద్దలకూ రెండు కళ్లూ సరిపోవు. హరిలో రంగ హరి అంటూ శ్రీహరి నామస్మరణ చేస్తూ ఇంటింటికి తిరిగే హరిదాసులు లేకుండా సంక్రాంతి పండుగ పూర్తయినట్టే కాదు. అయితే ఈ సంప్రదాయం సంక్రాంతి సమయంలోనే ఎందుకు కనిపిస్తుంది? దీనికి ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం.
హరిదాసులు, బసవన్నలు దానం కోసం మాత్రమేనా?
హరిదాసులు, గంగిరెద్దులు ఇంటింటికి రావడం కేవలం బియ్యం లేదా కానుకల కోసమే అని చాలామంది భావిస్తారు. కానీ సంప్రదాయ విశ్వాసాల ప్రకారం, వీరు దానం తీసుకునే వారు కాదు.. భక్తులను ఆశీర్వదించేందుకు భువికి దిగివచ్చిన హరిహర స్వరూపాలు.
హరిదాసుడు అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా భావిస్తారు.
బసవన్న (గంగిరెద్దు) అంటే సాక్షాత్తు పరమేశ్వరుడితో పాటు వచ్చిన నందీశ్వరుడని విశ్వాసం.
భోగి రోజే ఈ సంప్రదాయం ఎందుకు?
భోగి రోజున ఇళ్ల ముందు ముగ్గులు వేసి, వాటి మధ్య గొబ్బిళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ ముగ్గు ఉన్న నేల ధర్మబద్ధమైన ప్రదేశమని అర్థం. అందుకే ఆ పవిత్ర ప్రదేశంలో నిల్చుని హరిదాసులు, బసవన్నలు భక్తులను ఆశీర్వదిస్తారని పెద్దల నమ్మకం.
గంగిరెద్దుల ప్రత్యేక అలంకరణ వెనుక భావం
సంక్రాంతి వేళ గంగిరెద్దులను అత్యంత వైభవంగా అలంకరిస్తారు. పాత బట్టలతో బొంతలా కుట్టి, అద్దాలు, చెమ్కీలు అద్దుతూ మూపురం నుంచి తోక వరకు కప్పుతారు. కాళ్లకు గజ్జెలు, మెడకు గంటలు కట్టి, కళాకారులు సన్నాయి, బూర, డోలు మోగిస్తూ నందీశ్వరుడిని ఇంటింటికి తీసుకొస్తారు.
నందీశ్వరుడి దీవెనలు ఉంటే ఏడాదంతా పాడిపంటలకు లోటు ఉండదని భక్తుల విశ్వాసం.
హరిదాసు అక్షయపాత్రకు ఉన్న అర్థం
హరిదాసుడు తలపై పెట్టుకునే గుమ్మడికాయ ఆకారపు పాత్ర భూమికి సంకేతంగా చెబుతారు. ఆ పాత్రను తలపై పెట్టుకోవడం అంటే శ్రీహరి భూమిని ఉద్ధరిస్తున్నానని తెలిపే సంకేతం. హరిదాసులు ప్రయాణంలో వెనక్కి తిరిగి చూడరు, ఎవరినీ అడగరు. ఎవరైనా ఇస్తే మాత్రమే స్వీకరిస్తారు. ఆ పాత్ర తలపై ఉన్నంతసేపూ ఇతరులతో మాట్లాడకుండా, కేవలం విష్ణు సంకీర్తనలు చేస్తూ సాగిపోతారు.
ప్రతి ఇంటి ముందు కాళ్లు కడిగి ఆశీర్వదించడం కూడా ఈ సంప్రదాయంలో భాగమే.
అందుకే…
సంక్రాంతి సమయంలో మీ ఇంటికి వచ్చే హరిదాసులు, బసవన్నలను ఖాళీ చేతులతో వెనక్కు పంపించవద్దని పెద్దలు చెబుతుంటారు. అది కేవలం దానం కాదు.. ఒక ఆశీర్వాదంగా భావిస్తారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సంప్రదాయ నమ్మకాల ఆధారంగా మాత్రమే. ఈ విషయాలను శాస్త్రీయంగా ధృవీకరించామని భావించరాదు. ఏదైనా అమలు చేసే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.