Ayodhya: అయోధ్య అంటే రాముడే కాదు.. ఈ శివుడి గుడి కూడా స్పెషలే!

Ayodhya: అయోధ్య అనగానే రామజన్మ భూమిగానే అందరికీ తెలుసు. రాముని ఆలయంతో పాటు అక్కడ ఒక శివాలయం కూడా ఉంది. దాని వివరాలు..

Update: 2026-03-09 04:27 GMT

Ayodhya

Ayodhya: అయోధ్య అనగానే మనకు రాముడే గుర్తొస్తాడు. శ్రీరాముని జన్మస్థలంగా మనందరికీ సుపరిచితం అయోధ్య. అక్కడికి వెళ్లాలని కోరుకునేవారు రామాలయ దర్శనం కోసమే ఆలోచిస్తారు. కానీ, అక్కడే పరమశివుడు కూడా కొలువై ఉన్నాడనే విషయం చాలామందికి తెలీదు. శీరాముని ఆలయానికి కాస్త దూరంలోనే చారిత్రాత్మకమైన శివాలయం కూడా ఉంది. నాగేశ్వరనాథుడిగా అక్కడ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. దీనిని స్వయంగా రాముని పుత్రుడు కుశలుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది.

ఆ కథ ఏమిటంటే..

Ayodhya: అక్కడి స్థల పురాణం ప్రకారం.. రాముడి కుమారుడు కుశుడు ప్రతిరోజూ వేకువ జామున సరయు నదిలో స్నానం చేశేవాడు. ఒకరోజు అలా స్నానం చేస్తుండగా ఆయన చేతికి కట్టుకున్న తాయెత్తు నీటిలో జారిపోయింది. దానికోసం ఆయన అక్కడ చాలా వెతికాడు. ఆయన సేవకులు కూడా దానికోసం వెతుకులాడారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అది దొరకలేదు. దీంతో కుశుడు నిరాశతోనే అంతఃపురానికి వెళ్ళిపోయాడు. దానిగురించి ఆయన చాలా ఆందోళన చెందాడు.

కొన్నిరోజుల తరువాత సరయూనది వద్ద స్నానం చేసి తిరిగి వస్తున్న ఒక నాగకన్య కుశుడి వద్దకు వచ్చింది. ఆమె కుశుడు పోగొట్టుకున్న తాయెత్తును తీసుకువచ్చింది. అది చూసిన కుశుడు పరమానందభరితుడు అయ్యాడు. చాలా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తనకు దానికి తెచ్చి ఇచ్చిన నాగకన్యను నీకేమి కావాలో అడుగు.. నేను ఇస్తాను అని చెప్పాడు. అందుకు ఆమె ‘నేను నిత్యం పూజ చేసుకోవడానికి ఇక్కడ ఒక శివాలయం నిర్మించండి’ అని కోరింది. దీనికి అంగీకరించిన కుశుడు వెంటనే ఆలయాన్ని నిర్మించి, శివుడిని ప్రతిష్టించాడు. ఆ శివాలయానికి నాగేశ్వరనాథ్ అని పేరుపెట్టాడు. అప్పటి నుంచి ఆ నాగకన్య అక్కడ శివుడికి నిత్యం పూజలు చేసేదని ప్రతీతి.

చెక్కు చెదరని ఆలయం..

Ayodhya: తరువాతి కాలంలో అయోధ్యలో ఎన్నో ఆలయాలు ముష్కరుల దాడుల్లో.. ప్రకృతి వైపరీత్యాలలో దెబ్బతిన్నాయి. కానీ, ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా అలానే నిలిచింది. ఒకానొక సమయంలో ఈ ఆలయాన్ని చూసిన చంద్రగుప్త విక్రమాదిత్యుడు చెక్కు చెదరకుండా ఉన్న ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పూజాదికాలు లేకుండా ఉండిపోయిన శివయ్యను చూసి విస్తుపోయాడు. వెంటనే ఆలయానికి అవసరమైన మరమ్మత్తులు చేసి శివునికి పూజలు జరిగేలా ఏర్పాటు చేశాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు ఆలయం మళ్ళీ శిధిలావస్థలోకి వెళ్ళిపోయింది. అయితే, 1750లో సఫ్టర్ంగ్ ఆస్థానంలో మంత్రి నావల్ రాయ్ పునరుద్ధరించారు. అప్పటి నుంచి ఈ ఆలయం భక్తులకు పారవశ్యం కలిగిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ఆలయంలో నాగేశ్వర్ నాధునికి నిత్యపూజలు జరుగుతున్నాయి.

విష జంతువుల నుంచి రక్షణ

Ayodhya: ప్రస్తుతం నాగేశ్వరనాధుని ఆలయం రంగులతో మెరిసిపోతోంది. ఈ ఆలయంలో మూడు గోపురాలు ఉత్తర భారత శైలిలో నిర్మితమై కనువిందు చేస్తరయ్యి. గర్భగుడి పైభాగం వెండితో తయారు చేశారు. స్వామి నాగేశ్వర్ నాథ్ దీపం వెలుగులో ప్రకాశిస్తాడు. ఈ ఆలయాన్ని దర్సించిన వారికి.. ఇక్కడి నాగేశ్వర నాధుని పూజించిన వారికీ విష జంతువులతో ఎటువంటి సమస్యలు తలెత్తవని ప్రతీతి. అలాగే ఇక్కడ శివరాత్రి రోజు జరిగే స్వామి వారి పల్లకి సేవలో పాల్గొంటే పాపాలన్నీ పోతాయని చెబుతారు. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలోనే గణేశుడు, హనుమంతుడు కూడా కొలువై ఉన్నారు. వారిని కూడా దర్శించుకోవచ్చు.

రామాలయానికి దగ్గరలోనే..

రామాలయానికి దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. నడిచి వెళ్లగలిగే దూరమే. నడవలేని వారు అక్కడ ఆటోలపై ప్రయాణించి అక్కడకు చేరుకోవచ్చు. అయోధ్య రాముని దర్శనానికి వెళ్లిన ప్రతివారు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన చారిత్రాత్మక శివాలయం ఇది.

ఈ ఆలయం ప్రతిరోజూ ఉదయం 5 నుంచి 12 వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటుంది.

Tags:    

Similar News