Lighting a Lamp: ఏదైనా కార్యక్రమానికి ముందు దీపం ఎందుకు వెలిగించాలి? సనాతన ధర్మంలో దీని ప్రాధాన్యత ఏమిటి?
Lighting a Lamp: సనాతన సంప్రదాయంలో దీప ప్రజ్వలన ప్రాముఖ్యత ఏమిటి ? అసలు దీపం ఎలా ప్రతికూల శక్తులను తొలగిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుందో తెలుసుకుందాం
Lighting a Lamp
Lighting a Lamp: గర్భగుడిలో దీపాల వెలుగులో భగవంతుని చూస్తే కలిగే ఆధ్యాత్మిక అనుభూతి మాటల్లో చెప్పలేనిది. చిమ్మ చీకటిలో ఒక దీపపు వెలుగు కనిపిస్తే వచ్చే ఆహ్లాదం వర్ణించలేం. దీపం కేవలం వెలుగును ఇచ్చే కాంతి మాత్రమే కాదు. మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే దిక్సూచి కూడా. మన భారతీయ సంప్రదాయంలో దీపానికి ఉన్న ప్రాధాన్యత తక్కువ కాదు. గుడిలో.. బడిలో.. ఇంట్లో.. పూజలు.. వ్రతాలూ.. నోములు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. సభలు.. సమావేశాలు ఇలా ఏ సందర్భంలోనైనా దీపం వెలిగించి తరువాత కార్యక్రమం ప్రారంభించడం హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం జరుగుతూ వచ్చే పవిత్ర విధానం.
ఈ సంప్రదాయం యుగయుగాలుగా భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వెలుగు అనేది జ్ఞానానికి, చీకటి అనేది అజ్ఞానానికి చిహ్నాలుగా పరిగణిస్తారు. అందుకే అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించమని కోరుతూ ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తారు.
దీపం కేవలం ఒక కాంతి వనరు మాత్రమే కాదు. అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. "దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధనః దీపో హరతుమే పాపాని సంధ్యా దీప దేవా నమోస్తుతే" అనే శ్లోకం దీపంలో దైవత్వాన్ని చాటిచెబుతుంది. దీపం వెలిగించడం వల్ల మనసులోని అశాంతి తొలగిపోయి, ప్రశాంతత ఏర్పడుతుందని పండితులు చెబుతుంటారు.
ఆధ్యాత్మిక ప్రాధాన్యత..
Lighting a Lamp: దీపాన్ని వెలిగించినప్పుడు దాని జ్వాల ఎల్లప్పుడూ పైకే మండుతుంది. ఇది మనిషి ఎదుగుదలకు, ఉన్నతమైన ఆలోచనలకు, శ్రేయస్సుకు సంకేతం. మనం చేసే పనులన్నీ ఉన్నత ఆశయాలతో ఉండాలని, సమాజానికి వెలుగునివ్వాలని ఈ జ్వాల మనకు గుర్తుచేస్తుంది.
పూజ గదిలో లేదా ఇంటి గుమ్మం వద్ద దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు నశిస్తాయని నమ్మకం. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగించి, సానుకూల వాతావరణాన్నిసృష్టించడంలో దీపం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. అందుకే సంధ్యా సమయంలో దీపం వెలిగించే అలవాటును మన పూర్వీకులు ఒక నియమంగా పెట్టారు.
ఆరోగ్య పరంగా..
దీపం వెలిగించడం వెనుక ఆధ్యాత్మిక కారణాలే కాకుండా కొన్ని వైజ్ఞానిక కారణాలు కూడా ఉన్నాయి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపం నుండి వచ్చే పొగ గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను , క్రిములను నాశనం చేస్తుంది. ఇది గాలిని శుద్ధి చేసి, శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ముఖ్యంగా ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల వెలువడే ఓజోన్ వంటి వాయువులు మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. దీపకాంతి కళ్లకు కూడా చలవను ఇస్తుంది. రాత్రి సమయాల్లో దీపపు వెలుగులో ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.
పండుగలలో దీపాలు..
మనదేశంలో 'దీపావళి' పండుగ ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. దీపావళి అంటేనే దీపాల వరుస. ప్రతి ఇంటి ముంగిట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. కేవలం దీపావళి మాత్రమే కాకుండా, కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో దీపాలు వెలిగించడం వల్ల భగవంతుని అనుగ్రహం దొరుకుతుందని భక్తుల నమ్మకం.
మట్టి ప్రమిదలు..
సాధారణంగా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరమని శాస్త్రం చెబుతోంది. మట్టి భూమికి సంకేతం, నూనె మనలోని కోరికలకు సంకేతం, దీపంలో ఉపయోగించే పత్తి వత్తి మన అహంకారానికి సంకేతం. జ్ఞానమనే అగ్నితో మనలోని అహంకారాన్ని దహించి, దైవత్వంలో విలీనం కావడమే దీపారాధనలోని పరమార్ధం అని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి.
గమనిక: ఈ ఆర్టికల్ లోని అంశాలు ఆయా విశ్వాసాల మీద ఆధారపడి ఉన్నాయి. పురాణ గాథలు.. పండితులు చెప్పిన విషయాల ఆధారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది.