Kanuma Festival 2026: కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదంటారు? శాస్త్రం ఏం చెబుతోంది?

Kanuma Festival 2026: మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ అనంతరం వచ్చే రోజే కనుమ.

Update: 2026-01-16 05:00 GMT

Kanuma Festival 2026: కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదంటారు? శాస్త్రం ఏం చెబుతోంది?

Kanuma Festival 2026: మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ అనంతరం వచ్చే రోజే కనుమ. ఏటా సంక్రాంతి వచ్చినట్లే కనుమ కూడా వస్తుంది. అయితే మకర సంక్రాంతి తరువాత వచ్చే కనుమకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇది ప్రధానంగా పాడి పశువులకు అంకితమైన పండుగ. వ్యవసాయంలో రైతుకు సహకరించిన పశువుల పట్ల కృతజ్ఞత చాటే రోజు ఇదే.

రైతులు పండిన పంటను తమ కుటుంబంతో పాటు పశుపక్ష్యాదులతో కూడా పంచుకోవాలనే భావనతో ఇంటి గుమ్మాలకు పిట్టల కోసం ధాన్యపు కంకులను కడతారు. ఇదిలా ఉండగా, “కనుమ రోజు కాకినా కదలదు” అనే సామెత మనకు గుర్తుకు వస్తుంది. ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని పెద్దలు చెబుతుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

పూర్వకాలంలో గ్రామీణ జీవనంలో పశువులే ప్రధాన సంపద. రైతు జీవితం మొత్తం వాటిపైనే ఆధారపడి ఉండేది. ఎద్దులు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటేనే రైతుకు ఉత్సాహం, పంటలకు మంచి దిగుబడి లభించేది. అందుకే కనుమను పశువులను పూజించే పండుగగా భావిస్తారు. గ్రామాల్లో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

కనుమ రోజున పశువులను నదీ తీరాలకు, చెరువుల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా కడుగుతారు. అనంతరం వాటి నుదుట పసుపు, కుంకుమ దిద్దుతూ, మువ్వల పట్టీలు కట్టి అలంకరిస్తారు. హారతులు ఇచ్చి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాగే పశువుల కొట్టాలు శుభ్రం చేసి, వ్యవసాయ పనిముట్లను కూడా కడిగి అలంకరిస్తారు.

ఏడాది పొడవునా రైతుతో పాటు కష్టపడే పశువులకు కనుమ రోజున ఎలాంటి పనులు చేయించకుండా పూర్తిగా విశ్రాంతి ఇస్తారు. రకరకాల గ్రామీణ ఆటలు, పోటీలు నిర్వహిస్తూ పండుగను ఆనందంగా గడుపుతారు.

ఇక కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదనే ఆచారం వెనుక ఉన్న ప్రధాన కారణం ఇదే. పూర్వం ప్రయాణాలంటే ఎక్కువగా ఎడ్ల బండ్లే ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించే సందర్భంలో, ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకూడదనే భావనతో బండ్లు కట్టకుండా, ప్రయాణాలు చేయవద్దని పెద్దలు సూచించేవారు. అంటే ఏడాదిలో కనీసం ఒకరోజైనా పశువులకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలనే గొప్ప ఆలోచన ఈ సంప్రదాయం వెనుక ఉంది.

ఇక నేటి వేగవంతమైన జీవనశైలిలో పండుగకు వచ్చిన బంధుమిత్రులు తొందరగా వెళ్లిపోకుండా, అందరూ కలిసి మరికొంత సమయం గడిపి, భోజనాలు చేస్తూ సంతోషంగా ఉండేందుకు కూడా ఈ ఆచారం ఉపయోగపడేదని చెప్పవచ్చు.

అయితే కనుమ రోజున వేరే ఊళ్లో రాత్రి నిద్ర చేయకూడదనే నియమానికి మాత్రం పెద్దగా శాస్త్రీయ ఆధారం లేదు. కొన్ని గ్రామాల్లో స్థానిక పరిస్థితులను బట్టి అలాంటి ఆచారం ఉండేది తప్ప, ఇది అన్ని ప్రాంతాల్లో పాటించాల్సిన నియమం కాదు.

ఇక తెలంగాణ ప్రాంతాల్లో కనుమ సమయంలో ‘గురుగుల నోము’ అనే ప్రత్యేక సంప్రదాయం ఉంది. కొత్తగా వివాహం చేసుకున్న వారు మట్టితో చిన్న పాత్రలను తయారు చేసి, అందులో బెల్లం–నువ్వుల ఉండలు, చెరకు ముక్కలు, చిల్లర నాణేలు, రేగుపళ్లు, జీడిపళ్లు వంటి వాటిని పెట్టి తాంబూలంగా ఇవ్వడం అక్కడి ఆనవాయితీ.

ఇలా కనుమ పండుగలో ప్రతి ఆచారం వెనుక ప్రకృతి, పశువులు, కుటుంబ బంధాలు అన్నింటినీ గౌరవించే గొప్ప భారతీయ సంస్కృతి దాగి ఉంది.

Tags:    

Similar News