Tiffin: ఉదయమే టిఫిన్ ఎన్ని గంటల్లోపు చేయాలి..! లేదంటే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు!
Tiffin: మనం ప్రతిరోజు టిఫిన్ చేస్తాం. కానీ రోజూ ఒకే సమయానికి చేస్తున్నామా అని ప్రశ్నిస్తే ఎవ్వరూ సమాధానం చెప్పరు
బ్రేక్ ఫాస్ట్ (ఫైల్ ఇమేజ్)
Tiffin: మనం ప్రతిరోజు టిఫిన్ చేస్తాం. కానీ రోజూ ఒకే సమయానికి చేస్తున్నామా అని ప్రశ్నిస్తే ఎవ్వరూ సమాధానం చెప్పరు. ఎందుకంటే ఒక రోజు ముందు తినవచ్చు మరొక రోజు కాస్త ఆలస్యంగా తినవచ్చు. కానీ ఈ విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోము. అయితే టిఫిన్ కూడా సరైన సమయానికి తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక రోజు ఓ సమయం, మరొక రోజు మరో సమయం, ఇంకో రోజు అసలు టిఫిన్ తినకపోవడం లాంటి పనుల వల్ల దీర్ఘకాలింగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు ఇదివరకే షుగర్, బీపీ, వంటి వ్యాధులతో బాధపడుతుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎన్ని గంటల్లోపు టిఫిన్ తింటే ఆరోగ్యానికి మంచిది. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన తర్వాత రెండున్నర గంటల్లోపు టిఫిన్ తినాలి. దీంతో పాటు పళ్ల రసాలు కూడా తాగవచ్చు. కానీ ఆధునిక కాలంలో జీవనశైలి విభిన్నంగా మారిపోయింది. బిజీ లైఫ్ కారణంగా చాలామంది ఇష్టమొచ్చిన విధంగా టిఫిన్ చేస్తున్నారు. లేదంటే ఖాళీ సమయం దొరికినప్పుడు టిఫిన్ చేస్తున్నారు. ఇది తప్పు. టిఫిన్ ప్రతిరోజు ఉదయం 8:30 గంటలలోపు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మార్చిలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ వర్చువల్ కాన్ఫరెన్స్ (ENDO 2021) చేసిన అధ్యయనం ప్రకారం ఉదయాన్నే టిఫిన్ తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుందని, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని తేలింది.
ఉదయమే టిఫిన్ చేయడం వల్ల మధ్యాహ్నం సరైన సమయానికి ఆకలి వేస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియ సులువుగా జరుగుతుంది. సకాలంలో నిద్రకు ఉపక్రమిస్తారు. ఉదయం టిఫిన్ ఆలస్యంగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. అల్సర్, కడుపులో గ్యాస్, జీర్ణక్రియ సమయస్యలు మొదలైనవన్ని ఉత్పన్నమవుతాయి. సమయానికి టిఫిన్ తినడం కుదరకపోతే కనీసం ఫ్రూట్స్ అయినా తీసుకోవాలి. జ్యూసులు, పాలు కూడా తాగవచ్చు. అంతేకాదు మీరు మధ్యాహ్నం అన్నం తినేవరకు ఎనర్జిటిక్‌గా ఉండాలన్నా టిఫిన్ తప్పనిసరి.
టిఫిన్ తినకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి..
1. బ్రేక్ ఫాస్ట్ మిస్ కావడం వల్ల శరీరం అలసటకు గురవుతుంది.
2. కొన్ని రోజుల తర్వాత రక్తహీనత మొదలవుతుంది.
3. శరీరం సహకరించకపోవడం వల్ల పనిమీద ఆసక్తి తగ్గిపోతుంది.
4. చిరాకు పెరగడమే కాకుండా మానసిక సమస్యలు ఏర్పడుతాయి.
5. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ కావడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు.