మన్యంలో 95 ఏళ్లలో కుటుంబ బాధ్యతలు మోస్తున్న బామ్మ
కాటికి కాళ్లు చాసే టైంలో.. సమస్యలకు ఎదురీడుతున్న బామ్మ మహిళల అలంకరణ సామాగ్రి వస్తువులు విక్రయిస్తూ జీవనం ఈమె కుమారుడు కాంతారావు ఏడాది క్రితం మృతి ఉన్న ఇద్దరు మనవళ్లను పోషిస్తున్న బామ్మ గంగమ్మ
మన్యంలో 95 ఏళ్లలో కుటుంబ బాధ్యతలు మోస్తున్న బామ్మ
ఆమె వయస్సు 95 ఏళ్ళు.. ఒంట్లో ఏమాత్రం సత్తువలేదు. కాటికి కాళ్లు చాసే వయసులో కూడా తనకున్న సమస్యలు భాధ్యతను గుర్తుచేస్తున్నాయి. బ్రతుకు జీవుడా ఊత కర్ర పట్టి ఊరూరా తిరిగి కాళ్లు ఈడుస్తోంది ఆ బామ్మ. అసలు వృద్ధాప్యంలో అంతగా కష్టపడాల్సిన పరిస్థితి ఆ బామ్మకు ఎందుకు వచ్చింది...!
ఈ వృద్ధురాలి పేరు దాసరి గంగమ్మ. మన్యం జిల్లా పెద్దబొండపల్లికి చెందిన ఈమె ఊరూరా తిరుగుతూ మహిళల అలంకరణ సామాగ్రి వస్తువులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈమె రోజూ ఉదయం 7 గంటలకు తన గ్రామం నుంచి ఆటోలో బయలుదేరి.. సాయంత్రం వరకు పట్టణ వీధుల్లో తిరుగుతూ అలంకరణ వస్తువులను విక్రయిస్తోంది. ఈ వయస్సులో నీకెందుకమ్మా ఇంత కష్టం అని అడిగితే... తన మనోవేదనను బయటపెడుతోంది బామ్మ. తన ఇద్దరు మనవళ్లను పోషించి, చదివించాలంటే.. కష్టపడాలి కధా..అంటూ తన భాధ్యతను గుర్తు చేస్తోంది బామ్మ.
ఈమె కుమారుడు కాంతారావు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఈమె కోడలు కొడుకులను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనవళ్లు
శంకర్, మహేష్ బాధ్యత గంగమ్మపై పడింది. ప్రస్తుతం ఇద్దరు మనవళ్లు పెద్దబొండపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. గంగమ్మకు వచ్చే 4వేల వృద్ధాప్య పెన్షన్‌తో మనవళ్లను పెంచటానికి భారంగా మారింది.. దీంతో గత్యంతరం లేక ఇలా చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకీడుస్తూ.. తమ ఇద్దరు మనవళ్ళను పోషించుకుని, చదివిస్తున్నానని గంగమ్మ కన్నీరు పెట్టుకుంటుంది..
ప్రస్తుతం తమను పోషిస్తూ, చదివించడానికి ఆర్ధికభారంగా మారిందని మనవళ్లు అంటున్నారు. వృద్ధాప్యంలో ఇంతటి కష్టం అనుభవిస్తున్న బామ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అయితేఇటువంటి వయస్సులో బామ్మ గంగమ్మ పడుతున్న కష్టం పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.