Viral Video: మృత్యువు అంచున చిన్నారి.. దేవుడిలా కాపాడిన బస్సు డ్రైవర్.. కేరళలో గుండె ఆగిపోయే దృశ్యం!
Viral Video: అదృష్టం బాగుంటే చావు అంచు వరకు వెళ్లినా ప్రాణాలు దక్కుతాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.
Viral Video: అదృష్టం బాగుంటే చావు అంచు వరకు వెళ్లినా ప్రాణాలు దక్కుతాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఒక చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. బస్సు డ్రైవర్ చూపిన అసాధారణ సమయస్ఫూర్తి ఆ చిన్నారికి పునర్జన్మనిచ్చింది.
అసలేం జరిగింది?
కోజికోడ్ జిల్లా కొడియత్తూరు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటో వెనుక నుంచి ఒక చిన్నారి అకస్మాత్తుగా రోడ్డు వైపు పరుగెత్తింది. సరిగ్గా అదే సమయంలో ఒక ప్రైవేట్ బస్సు వేగంగా ఆ రోడ్డుపై దూసుకొస్తోంది. అకస్మాత్తుగా చిన్నారి అడ్డు రావడంతో బస్సు ఆమెపైకి ఎక్కేయాల్సింది. కానీ, డ్రైవర్ క్షణాల్లో స్పందించాడు.
డ్రైవర్ చాకచక్యం.. నెటిజన్ల సెల్యూట్:
పాపను గమనించిన వెంటనే డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడమే కాకుండా, బస్సును వేగంగా పక్కకు మళ్లించాడు. దీంతో బస్సు టైర్ల కింద పడాల్సిన చిన్నారి.. కేవలం అంగుళాల దూరంలో ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం తీవ్రతను గ్రహించిన పాప వెంటనే వెనక్కి పరుగెత్తింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
తల్లిదండ్రులపై ఆగ్రహం:
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్‌ను నెటిజన్లు రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. అయితే, చిన్నపిల్లలను రోడ్ల మీదకు ఒంటరిగా వదిలేసిన తల్లిదండ్రులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ఈ రోజు ఒక కుటుంబంలో తీరని శోకం మిగిలేది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.