Post Office Schemes: బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ.. రిస్క్ లేని పెట్టుబడి! పోస్టాఫీసులో 5 సూపర్ హిట్ స్కీమ్స్ ఇవే!
Post Office Saving Schemes 2026: రూపాయికి భద్రత, బ్యాంకు కంటే ఎక్కువ రాబడి కావాలని అనుకునే వారికి అదిరిపోయే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ను తెలుసుకోండి.
Post Office Saving Schemes 2026
Post Office Schemes: మనం కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు.. అక్కడ ఫస్ట్ చూసేది.. సెఫ్టీ, బెనిఫిట్స్. ఈ రెండింటి కలయికే పోస్టాఫీసు పథకాలు. ప్రభుత్వ గ్యారెంటీ ఉండటం వల్ల వీటిలో రిస్క్ సున్నా. పైగా బ్యాంకుల కంటే మెరుగ్గా 7% నుంచి 8% పైగా వడ్డీని ఈ పథకాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు, రిటైర్డ్ వ్యక్తుల కోసం రూపొందించిన 5 సూపర్ హిట్ స్కీమ్స్ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ (MSSC)
మహిళల ఆర్థిక సాధికారత కోసం 2023లో ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుతం 7.5% వడ్డీని అందిస్తోంది. కేవలం రూ.1000తో ఖాతా తెరవవచ్చు. ఇందులో పొదుపు చేసుకోవాలని అనుకునే వారు గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 2 ఏళ్ల కాలపరిమితితో వస్తుంది. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత అవసరమైతే 40% నగదును వెనక్కి తీసుకోవచ్చు.
2. సుకన్య సమృద్ధి యోజన (SSY)
ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి కోసం ఇది అత్యుత్తమ పథకం అని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. 10 ఏళ్లలోపు వయసున్న కుమార్తె పేరు మీద దీనిని స్టార్ట్ చేయవచ్చు. ఇందులో పొదుపు చేసే వారికి ప్రస్తుతం ప్రభుత్వం 8.2% వడ్డీని ఇస్తోంది. ఇందులో పొదుపు చేసుకోవాలని అనుకునే వారు ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేయవచ్చు. క్రమం తప్పకుండా 15 ఏళ్ల పాటు గరిష్ట పరిమితి మేరకు పెట్టుబడి పెడితే, ఈ పథకం మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ.69,27,578 పొందవచ్చు. దీనిపై టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
3. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
దీర్ఘకాలిక పెట్టుబడులు, పన్ను మినహాయింపు కోరుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సరైన ఛాయిస్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకానికి ఏడాదికి 7.1% వడ్డీ వస్తుంది. ఇందులో పొదుపు చేయాలని అనుకునే వారు ఏడాదికి కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. దీనికి లాక్-ఇన్ పీరియడ్ 15 ఏళ్లు. మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. దీనిపై వచ్చే వడ్డీ, అసలు రెండింటికి ఎలాంటి పన్ను లేదు.
4. పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS)
ఒక్కసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా ఆదాయం పొందాలనుకునే వారికి పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పెట్టుబడి పెడితే ఏడాదికి 7.4% వడ్డీ వస్తుంది. సింగిల్ అకౌంట్ అయితే రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.15 లక్షల వరకు గరిష్టంగా డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ ద్వారా గరిష్టంగా నెలకు రూ.9,250 వరకు వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
5. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS)
రిటైర్మెంట్ తర్వాత డబ్బు విషయంలో టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వరం లాంటిదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ స్కీమ్ బ్యాంక్ ఎఫ్డీల కంటే ఎక్కువగా 8.2% వడ్డీని ఇస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వారు గరిష్టంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.61,500 వడ్డీ వస్తుంది. అంటే నెలకు సగటున రూ.20,500 ఫిక్స్‌డ్ ఆదాయం అన్నమాట. దీని కాలపరిమితి 5 ఏళ్లు.